తమిళనాడులో దశాబ్దాలుగా ద్రావిడ రాజకీయాలదే హవా. బీజేపీకి అక్కడ ఆశించిన స్థాయిలో పట్టు లేదనేది బహిరంగ రహస్యం. కానీ లేటెస్ట్ గా, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ఆయన మధురాంతకం పర్యటన చూస్తుంటే, ఆ లెక్కలను మార్చేసే బలమైన ఆత్మవిశ్వాసం ఆయనలో కనిపిస్తోంది. “తమిళనాడు ఎన్డీయే పక్షాన ఉంది” అని ఆయన అంత ఖచ్చితంగా చెప్పడం వెనుక ఒక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం దాగి ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
మోదీ కాన్ఫిడెన్స్‌కు ప్రధాన కారణం ఎన్డీయే కూటమి మళ్లీ ఏకతాటిపైకి రావడం. నిన్నటి వరకు ఎడప్పాడి పళనిస్వామి (EPS) నాయకత్వంలోని ఏఐఏడీఎంకేతో ఉన్న విభేదాలు సమసిపోయి, ఈ రోజు మోదీతో కలిసి ఒకే స్టేజీపై వారు కనిపిస్తుండటం కూటమికి కొత్త ఊపిరినిచ్చింది. కేవలం ఏఐఏడీఎంకే మాత్రమే కాకుండా, పీఎంకే, ఏఎమ్మీకే (AMMK) వంటి మరో ఆరు పార్టీలు మోదీ నాయకత్వాన్ని బలపరుస్తుండటం గమనించాల్సిన విషయం.
అధికార డీఎంకే ప్రభుత్వంపై ఉన్న అవినీతి ఆరోపణలు, సనాతన ధర్మం వంటి సున్నితమైన అంశాలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను అస్త్రాలుగా మలుచుకోవడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. మోదీ తన ట్వీట్‌లో “తమిళనాడు ప్రాంతీయ ఆకాంక్షలకు మేము కట్టుబడి ఉన్నాం” అని పేర్కొనడం ద్వారా, ద్రావిడ పార్టీలు వాడుకునే సెంటిమెంట్‌ను తాము కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఆత్మవిశ్వాసమే ఆయనను మధురాంతకం సభలో డీఎంకేకు నేరుగా సవాలు విసిరేలా చేసింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ (TVK) రాజకీయ అరంగేట్రం చేస్తుండటం కూడా ఇక్కడ ఒక కీలక అంశం. ఓట్లు చీలే అవకాశం ఉండటంతో, బలమైన కూటమితో ఉంటే ఈసారి తమిళ గడ్డపై పాగా వేయడం సాధ్యమేనని మోదీ నమ్ముతున్నారు. కేరళలో అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా దక్షిణాది పర్యటనను ప్రారంభించిన ఆయన, ఆ వెంటనే తమిళనాడులో ఎన్నికల శంఖారావం పూరించడం ద్వారా తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు.
తమిళనాడులో బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం తక్కువగా ఉన్నప్పటికీ, మోదీ తన వ్యక్తిగత చరిష్మా సమర్థవంతమైన కూటమి రాజకీయాలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని చూస్తున్నారు. డీఎంకే ‘కోట’ను బద్దలు కొట్టడానికి ఆయన ప్రదర్శిస్తున్న ఈ కాన్ఫిడెన్స్ ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates