రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీ సర్వేపై వైసీపీ అధినేత జగన్ తనదైన శైలిలో స్పందించారు. ఎరా ఎయ్యి పడితే ఆరాయితో సరిహద్దులు నిర్ణయిస్తున్నారని, ఇదేం సర్వే అని ప్రశ్నించారు. అయితే వాస్తవంగా వైసీపీ హయాంలోనే సర్వే రాళ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. సర్వే రాళ్ల కోసం సుమారు 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంతో పాటు ఖరీదైన గ్రానైట్ రాయిని వినియోగించడం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది.
అంతేకాదు, ఆ సర్వే రాళ్లపై జగన్ ఫొటోలను కూడా ముద్రించారు. దీనిపై హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. భూముల రీ సర్వేకు సంబంధించి రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలపై కూడా జగన్ బొమ్మ ఉండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, తాము అధికారంలోకి వస్తే రీ సర్వేను పారదర్శకంగా చేపడతామని, పాస్ పుస్తకాలపై ఉన్న బొమ్మలను తొలగిస్తామని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖరీదైన సర్వే రాళ్లను తొలగించి సాధారణ రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోను తొలగించి ప్రభుత్వ రాజముద్రను ముద్రించారు. దీంతో రీ సర్వే ప్రక్రియ మరింత స్పష్టంగా, నమ్మకంగా సాగుతోందని రైతులు చెబుతున్నారు.
ఇక గతంలో జరిగిన తప్పులను కూడా సరిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా కూడా జగన్ ఇప్పుడు సరిహద్దు రాళ్లు సరిగా లేవని, పాస్ పుస్తకాలు సరిగ్గా లేవని వ్యాఖ్యానించడం గమనార్హం.
రీ సర్వే అనేది కేంద్ర ప్రభుత్వ స్థాయి కార్యక్రమం. ఇది దేశవ్యాప్తంగా అమలులో ఉంది. తెలంగాణలో భూ భారతి పేరుతో, ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ పేరుతో ఈ ప్రక్రియను గతంలో చేపట్టారు. ప్రస్తుతం రీ సర్వే పేరుతో కొనసాగిస్తున్నారు. అయినా జగన్ మాత్రం ఈ పథకం తన ఆలోచనతోనే వచ్చిందని, తానే దీనికి రూపకల్పన చేశానని చెప్పడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates