పార్టీ అధినేత మనసులో ఉన్న మాటే.. నాయకులూ చెబుతున్నారా..? వైసీపీలో వలంటీర్ల విషయంలో తమ వైఖరిని తేల్చేసిందా..? ఈ రోజు వైసీపీ అధినేత విలేకరుల సమావేశంలో జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. తమ హయాంలో ఒక్క నోటిఫికేషన్ తోనే 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని గొప్పగా చెప్పారు. అయితే ఆయన వలంటీర్ల విషయం కనీసం ఊసు ఎత్తకపోవడం గమనార్హం.
వలంటీర్ల అంశంపై ఇటీవల జగన్ కు సన్నిహితుడు వైసీపీ నేత బాల నాగిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ వ్యవస్థను నమ్ముకొని తాము ప్రజలకు న్యాయం చేయలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యవస్థ కారణంగా ప్రజలు, నాయకుల మధ్య దూరం పెరిగిందన్నారు. వలంటరీ వ్యవస్థే తమ కొంపముంచిందని, భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి తేల్చిచెప్పేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్ల వ్యవస్థ గొప్పగా పనిచేసిందని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు వారి ద్వారా చేరాయని అంటారు. అయితే గత ఎన్నికల్లో వలంటీర్లు పనిచేయకుండా న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. ఆ తర్వాత కూటమి గెలిచింది. వలంటీర్ల ఊసే లేకుండా పోయింది.
వలంటీర్లు లేకుండా ప్రతి నెలా పింఛన్లను నేరుగా లబ్ఢిదారుల ఇంటికి చేరవేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు నిరూపించారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా వైసీపీ వలంటీర్ల ఊసే ఎత్తడం లేదు. అదే బాటలో జగన్ఈ రోజు వారి మాట ఎత్తకుండానే గ్రామ సచివాలయాల గురించి చెప్పారు. తమ హయాంలో
15వేల గ్రామ సచివాలయాలు నిర్మించాం అన్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులను పెట్టడం ఒక రికార్డు అని ప్రకటించారు. ఒక్క నోటిఫికేషన్ తోనే 1.34లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతి సచివాలయంలో వీఆర్వో, సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారు. భూసర్వేలో 40వేల మంది సర్వేయర్లు, రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారంటూ చెప్పారు కానీ వలంటీర్ల గురించి ఏమీ మాట్లాడలేదు. అంటే వలంటీర్లను జగన్ మరిచిపోయినట్లేనా.. అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates