తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అయితే, నైనీ కోల్ బ్లాక్ టెండర్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, దాని గుట్టు రట్టు చేసినందుకే హరీశ్ రావుకు హుటాహుటిన సిట్ నోటీసులిచ్చి విచారణకు పిలిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అంతేకాదు, రెండేళ్లుగా కార్తీక దీపం సీరియల్ మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతూనే ఉందని, ఆ పంచాయతీ తెగడం లేదని ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులిచ్చారు. కేటీఆర్ కు 160 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చిన సిట్ అధికారులు శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆల్రెడీ హరీశ్ రావును 7 గంటలపాటు విచారణ జరిపిన సిట్ అధికారులు కేటీఆర్ ను ఎన్ని గంటలపాటు విచారణ జరుపుతారు అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది.
కాగా, నైనీ కోల్ బ్లాక్ టెండర్ వ్యవహారంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిల మధ్య తేడాలు వచ్చాయని, అందుకే భట్టి ఆ టెండర్ రద్దు చేశారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు చేసిన మరుసటి రోజే కేటీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates