మరో ఆరు రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలకంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత అంశం ముందుకు రానుంది. అమరావతిని రాజధానిగా ప్రకటించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. కూటమి ప్రభుత్వానికి ఇది రాజకీయంగా కీలక మైలురాయిగా మారనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ వైఖరి ఏంటన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఈ రోజు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీలతో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేత వంటి అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అమరావతి అంశంపై జగన్ ఎలాంటి సూచనలు ఇస్తారన్నది మాత్రం ఉత్కంఠగా మారింది.
అమరావతి రాజధాని నిర్మాణంపై జగన్ మొదటి నుంచీ వ్యతిరేక వైఖరినే అవలంబించారు. ఇప్పుడు అదే అంశంపై చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలు దాన్ని అడ్డుకుంటారా? లేక పార్లమెంట్ సాక్షిగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారా అన్నది చూడాల్సి ఉంది. రాజ్యాంగంలో ‘రాజధాని’ అనే పదమే లేదని, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధానిగా గతంలో వైసీపీ వాదించిన సంగతి తెలిసిందే. ఈ వాదననే మళ్లీ పార్లమెంట్‌లో వినిపిస్తారా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.
అమరావతిని ఐదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిన వైసీపీ పాపం వల్లే ఇప్పుడు చట్టబద్ధత అవసరం వచ్చిందని టీడీపీ విమర్శిస్తోంది. సాధారణంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు వైసీపీ పార్లమెంట్‌లో బేషరతుగా మద్దతు ఇస్తూ వస్తోంది. అమరావతి విషయంలో కూడా అదే ధోరణి కొనసాగుతుందా? లేక వ్యతిరేక వైఖరి తీసుకుంటుందా అన్నది రాజకీయంగా కీలకం కానుంది. స్పష్టమైన వైఖరి తీసుకోకుండా మధ్యస్థంగా ఉంటే అది వైసీపీకి మరింత నష్టం చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates