పాలన అంటే..కేవలం నాలుగు సంక్షేమ కార్యక్రమాలు.. రెండు అభివృద్ధి ప్రాజెక్టులేనా? అంటే.. ప్రజల కోణంలో చూసుకుంటే.. కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అభివృద్ధి, సంక్షేమాలతోపాటు.. ఒకింత వినోదం, వేడుకలు కూడా ఉండాలని భావిస్తారు. ఈ విషయంలో గత ఐదేళ్లలో వైసీపీ మూతి ముడుచుకుని కూర్చుంది. ఎక్కడా ఒక్క ఈవెంట్ కూడా నిర్వహించలేదు. ఎవరైనా ఈవెంట్లు చేసుకునేందుకు ముందుకు వచ్చినా.. వారిని కూడా తరిమేసింది. దీంతో ప్రజలకు గత ఐదేళ్లు.. వినోదం-వేడుక అనే మాటే వినిపించకుండా పోయింది.
అయితే. కూటమి సర్కారు… మాత్రం గత 18 మాసాల్లో ప్రజలకు ఇటు సంక్షేమం(సూపర్ సిక్స్), అటు అభివృద్ధి(అమరావతి, పోలవరం ప్రాజెక్టులు సహా ఇతర ప్రాజెక్టుల నిర్మాణం)తోపాటు వినోదాన్ని, వేడుకలను కూడా చేరువ చేస్తోంది. నగరాలు, పట్టణాల వారీగా ఈకార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగానే.. గత ఏడాది ‘విజయవాడ ఉత్సవ్’, తిరుపతిలోనూ వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత.. ఏదో ఒక రూపంలో ప్రతి చోటా ప్రజలకు వేడుక పంచేకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక, ఇప్పుడు అదిరిపోయేలా మరో వేడుకకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది.
ఇది పూర్తిగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు ఉద్దేశించిన కార్యక్రమమే అయినా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చేరువ చేయనున్నారు. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ‘విశాఖ ఉత్సవ్’ పేరుతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని మూడు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. ‘సాగరం నుంచి శిఖరం వరకు’ అనే థీమ్‌తో ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని విశాఖ, అనకాపల్లి, అరకు లోయ ప్రాంతాల్లో దీనిని నిర్వహిస్తున్నారు..
ఇవీ విశేషాలు..
- మొత్తం 20 ప్రధాన వేదికలపై 500కు పైగా సాంస్కృతిక, పర్యాటక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు.
- విశాఖపట్నంలో ప్రారంభమయ్యే వేడుకలు ఫిబ్రవరి 1న అనకాపల్లిలో ముగియనున్నాయి.
- తీరప్రాంత పర్యాటకం నుంచి మన్యం ప్రాంతపు గిరిజన సంస్కృతి వరకు ఇవి వేదికలు కానున్నాయి.
- సుమారు 3000 మంది స్థానిక కళాకారులు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
- బీచ్‌లలో డ్రోన్ షోలు, బీచ్ స్పోర్ట్స్, ఫ్లవర్ షో, మిస్ వైజాగ్ పోటీలు నిర్వహిస్తారు.
- అరకు, లంబసింగి ప్రాంతాలలో గిరిజన సంప్రదాయ నృత్యాలు, హస్తకళల ప్రదర్శన ఉంటాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates