ఉద్యోగం వ‌దిలేసి వ‌చ్చా.. న‌న్ను చూడండి బాబు స‌ర్‌.. !

“స‌ర్.. ఉద్యోగం వ‌దిలేసి వ‌చ్చా. 25 ఏళ్లుగా పార్టీలో ఉన్నా.. న‌న్ను కొంచెం చూడండి స‌ర్‌” అని ఒక‌రు. “గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ కూడా వ‌దిలేశా. ఇప్పుడు కూడా మీరు ప‌ట్టించుకోక‌పోతే.. నియోజ‌క‌వ‌ర్గంలో మొహం చూపించ‌లేను.” అని మ‌రొక‌రు!.. ఇలా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ముందు.. ప‌లువురు నాయ‌కులు.. గోడు వెళ్ల‌బోసుకున్నారు. గత ఆదివారం చంద్ర‌బాబు పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చారు. ఎన్టీఆర్ వ‌ర్ధంతిలో పాల్గొన్నారు.

అనంత‌రం పార్టీ సీనియ‌ర్లు.. ఆయ‌న‌ను అంత‌ర్గ‌తంగా వ‌న్ – టు – వ‌న్ క‌లుసుకున్నారు. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొచ్చారు. ఇదేస‌మ‌యంలో త‌మ మ‌న‌సులోని మాట‌ను కూడా అధినేత‌కు వివ‌రించారు. కొంద‌రు నాయ‌కులు నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. మ‌రికొంద‌రు వ్య‌క్తిగత డిమాండ్ల‌ను సునిశితంగా చంద్ర‌బాబు ముందు ఉంచారు. ఇంత‌కీ.. వీరి ఆవేద‌న‌.. ఆకాంక్ష ఒక్క‌టే.. త్వ‌ర‌లోనే ఖాళీ అవుతున్న రాజ్య‌స‌భ సీట్ల‌ను ద‌క్కించుకోవ‌డ‌మే.

కానీ.. పైకి మాత్రం ఈ డిమాండ్‌ను నేరుగా చంద్ర‌బాబు ముందు ఉంచ‌రు. కానీ, ప‌రోక్షంగా మాత్రం త‌మ ప్ర‌తిభ‌ను వెలికి తీసి.. చంద్ర‌బాబు ముందు పెట్టారు. ఈ విష‌యం చాలా ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఎవ‌రికి వారు మౌనంగా చంద్ర‌బాబును క‌లిసి .. బ‌య‌ట‌కు వ‌చ్చారు. రెండు రోజుల త‌ర్వాత‌.. ఈ వ్య‌వ‌హారం వెలుగు చూసింది. రాజ్య‌స‌భ సీట్లు నాలుగు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగులో రెండు క‌నీసం టీడీపీకి ద‌క్కే అవ‌కాశం ఉంది.

వీటిని ద‌క్కించుకునేందుకు ఇటు క‌మ్మ సామాజిక వ‌ర్గంలో న‌లుగురు కీల‌క నాయ‌కులు పోటీలో ఉన్నారు. ఇదేస‌మ‌యంలో మ‌రో ఎస్సీ నాయ‌కుడు, గ‌తంలో పోలీసు ఉద్యోగాన్ని వ‌దిలేసి టీడీపీలోకి వ‌చ్చిన వారు ఉన్నారు. ఈయ‌న గ‌తంలోనూ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అయినా.. త‌న‌కు న్యాయం చేయాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఇక‌, క‌మ్మ నేత‌ల్లో మాజీ మంత్రి ఒక‌రు బ‌లంగానే త‌న డిమాండ్‌ను వినిపించారు. కానీ, పైకి మాత్రం ఏమీ తెలియ‌ని నాయ‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీలో చ‌ర్చ సాగుతోంది.