టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు ఈ నెల 23న. అప్పటికి ఆయనకు 42 ఏళ్లు నిండి, 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన పుట్టిన రోజులు ఎలా చేసుకున్నా, ఈ ఏడాది నిర్వహించుకునే పుట్టిన రోజు ప్రజలకు గుర్తుండిపోయేలా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్లాన్ చేసింది.
నారా లోకేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పట్టాలు అందించనున్నారు. ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమం. ఇప్పటి వరకు కడు నిరుపేదలు ప్రభుత్వ భూములపై లేదా ఇతర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న భూములపై గూడు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. అయితే వాటిపై వారికి ఎలాంటి చట్టబద్ధ హక్కులు లేవు.
ఈ పరిస్థితిని మార్చే దిశగా ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఇలాంటి నిరుపేదలకు వారు నివసిస్తున్న స్థలాలనే క్రమబద్ధీకరించి పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు అదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
అంటే, ఆసరాలేని పేదలు ఎక్కడో ఒక చోట చూసుకుని ఏర్పాటు చేసుకున్న గూళ్లను ఇక నుంచి అధికారికంగా క్రమబద్ధీకరించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి పత్రాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. గత మూడు నెలలుగా నిర్వహించిన సర్వే ఆధారంగా పేదల వివరాలను పరిశీలించి దాదాపు రెండు లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు.
వారు నివసిస్తున్న స్థలం ప్రభుత్వానిదైనా, పోరంబోకు భూమైనా, అక్కడే ఇళ్లున్న పేదలకు ఇప్పుడు చట్టబద్ధ హక్కులు కల్పించనున్నారు. ఈ మొత్తం కార్యక్రమానికి జనవరి 23న నారా లోకేష్ పుట్టిన రోజున ముహూర్తంగా నిర్ణయించారు.
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొననున్నారు. మొదటి దశలో మడకశిర నియోజకవర్గంలోనే పది వేల మందికి పట్టాలు అందించనున్నారు. అనంతరం అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
