అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో గవర్నర్ వర్సెస్ డీఎంకే ప్రభుత్వం పోరు మరోసారి బహిరంగంగా బయటపడింది. మంగళవారం ఉదయం శాసనసభ సమావేశం ప్రారంభమైన వెంటనే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. గవర్నర్ ఆర్.ఎన్.రవి శాసనసభను ఉద్దేశించి ప్రసంగించేందుకు వచ్చారు.
తొలుత తమిళనాడు రాష్ట్ర గీతం ఆలపించగా, ఆ తర్వాత జాతీయ గీతాన్ని కూడా పాడాలని గవర్నర్ సూచించారు. అయితే సభ ప్రారంభంలో ‘తమిళ్ తాయి వాజ్తు’ మాత్రమే ఆలపించడమే సంప్రదాయమని స్పీకర్ ఎం.అప్పావు తేల్చి చెప్పారు. ఈ అంశంపై తీవ్ర వివాదం చెలరేగింది.
గవర్నర్ ప్రసంగం మధ్యలో స్పీకర్ జోక్యం చేసుకోవడంతో సభలో ఉద్రిక్తత మరింత పెరిగింది. గవర్నర్ ప్రస్తావించిన అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం సిద్ధం చేసిన సంప్రదాయ ప్రసంగ పాఠాన్ని మాత్రమే చదవాలని స్పీకర్ సూచించారు. ఈ విషయంలో వివాదం ముదిరి, గవర్నర్ ప్రసంగించకుండానే సభ నుంచి వాకౌట్ చేశారు.
దీనికి గవర్నర్ స్పందిస్తూ, తన బాధ్యతలపై తనకు స్పష్టత ఉందన్నారు. శాసనసభలో అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సింది ఎమ్మెల్యేలే తప్ప ఇతరులు కాదని స్పీకర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రసంగాన్ని చదవడమే గవర్నర్ విధి అని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో గవర్నర్ ఆర్.ఎన్.రవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పులతడకగా ఉన్న ప్రభుత్వ ప్రసంగాన్ని తాను చదవలేనని స్పష్టంగా చెప్పిన గవర్నర్, తాను మాట్లాడుతుండగా మైక్‌ను స్విచ్‌ఆఫ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో జాతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. గత రెండేళ్లుగా ఇదే తరహా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తాజా ఘటనతో తమిళనాడు రాజకీయాల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
