డీజీపీ ఆఫీసులో రాసలీలలు.. సీఎం సీరియస్

డీజీపీ.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు. అంటే పోలీసులకు బాస్. క్రమశిక్షణకు, నైతికతకు పెద్దపీట వేయాల్సిన పోస్టు. పైగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఆదర్శంగా ఉండాల్సిన కార్యాలయం. కానీ అదే కార్యాలయం రాసలీలలకు, ముద్దు ముచ్చట్లకు వేదికగా మారింది.

ఈ వ్యవహారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీంతో వెంటనే చర్యలకు ఆదేశిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఎక్కడ జరిగింది?

కర్ణాటక రాజధాని బెంగలూరులో డీజీపీ హోదాలో ఉన్న డాక్టర్ రామచంద్రరావు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే వాటిని ఆయన కొట్టి పారేశారు.

ఈ వ్యవహారం వివాదంగా మారుతున్న సమయంలో అనూహ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు వైరల్ అయ్యాయి. డీజీపీ రామచంద్రరావు ఏకంగా తన అధికారిక ఛాంబర్‌లోనే యూనిఫాంలో ఉండి, విధుల్లో ఉన్న సమయంలోనే మహిళలతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు ఈ వీడియోలలో బయటపడ్డాయి.

మహిళలను తన ఒడిలోకి లాక్కోవడం, వారితో ముద్దులు పెట్టే ప్రయత్నం చేయడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. వేర్వేరు సమయాల్లో వివిధ మహిళలతో ఆయన సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను ఆఫీసు సిబ్బందే వీడియో తీసినట్టు తెలుస్తోంది.

ఎందుకంటే డీజీపీ కార్యాలయం అంటే అత్యంత భద్రత నడుమ ఉంటుంది. ఎవరినీ ఫోన్‌తోనూ కూడా లోపలికి అనుమతించరు. అలాంటిది డీజీపీ రాసలీలలు వెలుగు చూడడం సంచలనంగా మారింది.

ఒక మహిళను కౌగిలించుకోవడం, మరొకరికి ముద్దు పెట్టడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారం గుప్పుమనగానే సీఎం సిద్ధరామయ్య స్పందించారు.

దీనిపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆయన హోం శాఖను ఆదేశించారు. డీజీపీ కార్యాలయాన్ని సందర్శించాలని మంత్రిని ఆదేశించారు. పోలీసు శాఖలో ఇంతటి నైతిక పతనం ఏంటంటూ నిప్పులు చెరిగారు.