తెలంగాణలో టీడీపీకి రెడ్ కార్పెట్ పడిందా? ఇక, ఆ పార్టీ పుంజుకునేందుకు అవకాశం ఏర్పడిందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీ పరంగా ఇప్పటి వరకు తెలంగాణలో పుంజుకునేందుకు ప్రయత్నించినా.. గతంలో బీఆర్ఎస్ పార్టీ అడ్డంకులు సృష్టించిందనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. టీడీపీలో బలమైన నాయకులు ఉండగా.. వారిని విభజించి.. పాలించు అన్నట్టుగా తన పార్టీలోకి తీసుకుంది.
తెలుగు దేశం పార్టీ అంటే.. తెలంగాణకు వ్యతిరేక మన్న ప్రచారం చేయడం ద్వారా బీఆర్ ఎస్ పార్టీ దాని ని అణిచేసే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ.. పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు చంద్రబాబు సహా.. పార్టీ నాయకులు కృషి చేశారు. త్వరలోనే మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న దరిమిలా.. ఇప్పుడు మరోసారి తెలంగాణలో టీడీపీ విస్తరించేందుకు అధికారికంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా టీడీపీని ఆహ్వానించారు.
అయితే.. ఆయన ఉద్దేశం ఏదైనా.. పార్టీవిస్తరణకు మాత్రం మార్గం సుగమం చేయడం గమనార్హం. బీఆర్ ఎస్ నాయకులను ఎండగట్టాలని.. ఆ పార్టీనిభూస్తాపితం చేసేందుకు టీడీపీ నాయకులు నడుం బిగించాలని కూడా రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఇది ఒకరకంగా.. టీడీపీకి వెన్నుదన్నగా మారుతున్న వ్యవహారం. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీఆర్ ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉండగా.. ఇప్పుడు కాంగ్రెస్ తోపాటు టీడీపిని కూడా బీఆర్ ఎస్‌కు ప్రదాన ప్రత్యర్థిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
తద్వారా.. సీఎం రేవంత్ రెడ్డి తన స్వీయ ప్రయోజనం చూసుకుంటున్నారన్న వాదన ఉన్నప్పటికీ.. పరోక్షంగా టీడీపీ ఎదుగుదలకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారన్న సంకేతాలు ఇచ్చినట్టు అయింది. పైగా.. అడ్డులేని వ్యవస్థ కూడా సహకరించనుంది.
ఇది టీడీపీకి అన్ని విధాలా సహకరించే అంశం. ఎక్కడైనా బీఆర్ ఎస్ అడ్డుపడినా.. అది కాంగ్రెస్ రూపంలో టీడీపీకి మద్దతు లభించే అవకాశం ఉంది. సో.. ఎలా చూసుకున్నా.. టీడీపీకి తెలంగాణలో ఇప్పుడు రెడ్ కార్పెట్ పరిచారు. దీనిని సద్వినియోగం చేసుకుంటే .. ఆ పార్టీకి మేలు జరగడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates