`పాల‌న కోసం పుస్త‌కం` ప‌ట్ట‌నున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా నిత్యం ఎంతో బిజీగా ఉండే రేవంత్ రెడ్డి..పుస్త‌కాలు ప‌ట్టుకుని స్టూడెంట్ గా మార‌నున్నారు. నిజానికి త‌న‌కు ఒక్క‌రోజు సెల‌వు కూడా ద‌క్క‌డం లేద‌ని.. తీసుకుందామ‌ని అనుకున్నా..ఏదో ఒక ప‌ని ఉంటోంద‌ని ఇటీవ‌ల సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. అంటే.. ఆయ‌న ఎంత బిజీగా ఉన్నారోచెప్ప‌డానికి ఇది ఉదాహ‌ర‌ణ‌.

అయినా.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత సుప‌రిపాల‌న‌ను చేరువ చేసేందుకు ఇప్పుడు ఆయ‌న పుస్త‌కం-పెన్ను ప‌ట్టుకుని విద్యార్థిగా మార‌నున్నారు. 5 రోజుల పాటు ఆయ‌న విద్యార్థిగా చ‌దువుకోనున్నారు. హోం వ‌ర్కులు చేయ‌నున్నారు. ప్రాజెక్టు నివేదిక‌లు కూడా స‌మ‌ర్పించ‌నున్నారు.

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ ఈ నెల 25 నుంచి 30వ తేదీ వ‌ర‌కు.. ఐదు రోజుల షార్ట్ పీరియ‌డ్ కోర్సును అందిస్తోంది. దీనిలో `లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ`(21వ శతాబ్ద‌పు నాయ‌క‌త్వం) పేరుతో ఈ కోర్సును నిర్వ‌హించ‌నుంది.

దీనిలో ప‌లు వ‌ర్త‌మాన రాజ‌కీయ అంశాల‌పై శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. పూర్తి ఆన్‌లైన్ విదానంలో జ‌రిగే ఈ కోర్సులో ప్ర‌పంచ వ్యాప్తంగా కేవ‌లం 150 మందికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించిన‌ట్టు తెలిసింది. దీనిలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్‌రోల్ అయ్యారు. ఈ కోర్సులో భాగంగా ప్ర‌పంచ స్థాయి నిపుణులు.. క్లాసులు చెబుతారు. హోం వ‌ర్క్ ఉంటుంది. అసైన్‌మెంట్లు ఇస్తారు. అదేవిధంగా ప్రాజెక్టు వ‌ర్కు కూడా ఉంటుంది.

ఈ ఐదు రోజుల కోర్సును విజ‌యవంతంగా పూర్తి చేసిన వారికి చివ‌ర‌లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేషన్ ల‌భిస్తుంది. ఇక‌, 20 దేశాల‌కు చెందిన నిపుణులు.. ఈ శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్టు యూనివ‌ర్సిటీ తెలిపింది. కోర్సు ఫీజు వివ‌రాలు తెలియాల్సి ఉంది. అయితే.. మ‌న దేశం నుంచి కూడా ప‌లువురు ఉన్న‌ప్ప‌టికీ.. అధికారంలో ఉన్న ముఖ్య‌మంత్రిగా.. రేవంత్ రెడ్డి ఒక్క‌రే ఎన్ రోల్ అయ్యారు.

ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి ఐవీ లీగ్ యూనివర్సిటీలో నాయకత్వ కోర్సు చేయడం ఇదే తొలిసారి. ఈ కోర్సు ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మ‌రింత సుప‌రిపాల‌నను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ కోర్సులో భాగంగా స‌మ‌స్య‌లు, స‌వాళ్ల‌ను అధ్య‌య‌నంచేయ‌డం.. ఆధునిక నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను వినియోగించి వాటికి ప‌రిష్కారాలు క‌నుగొన‌డం వంటివి ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు.