వైసీపీ ఎత్తులు పారడం లేదు. ఈ మాట ఆపార్టీ నాయకులే చెబుతున్నారు. కూటమి సర్కారుపై పైచేయి సాధించేందుకు ఎంచుకున్న అన్ని ప్రయోగాలు విఫలం అవుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనులు.. చేస్తున్న సంక్షేమం వంటివాటిని తమ ఖాతాలో వేసుకుని.. అవి అప్పట్లో జగనే ప్రారంభించారని.. ఇప్పుడు చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు.
కానీ.. ఇది ప్రజల్లోకి పెద్దగా ఎక్కడం లేదు. అంతేకాదు.. వైసీపీ చేస్తున్న ఈ ప్రచారాన్ని కూడా ఎవరూ పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే.. ఏదైనా వండినప్పుడే రుచి- అన్నట్టుగా నిజానికి వైసీపీ చేసి ఉంటే.. అప్పట్లోనే చెప్పుకొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అంతేకాదు.. నిజానికి ఇప్పుడు అది చేశాం.. ఇది చేశాం.. అని చెప్పుకొన్నా ఎవరూ వినిపించుకోవడం లేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
ఇక, రెండో విషయం.. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు పాల్గొంటున్న కార్యక్రమాల్లో వారు చేస్తున్న వ్యాఖ్యలను కోట్ చేస్తూ.. సోషల్ మీడియాలో చేస్తున్న వింత ప్రచారం కూడా వర్కువట్ కావడం లేదని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని అంటున్నారు.
ఏతా వాతా ఎలా చూసుకున్నా.. వైసీపీఎత్తులు పారడం లేదు. మరోవైపు.. పార్టీనుంచి బయటకు వచ్చేందుకు రెడీ అయిన వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముందుగా వీరిని కాపాడు కోవాలని కొందరు నాయకులు చెబుతున్నా.. పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోయే వారు పోనీ.. అన్నట్టుగా వదిలేయడంతో నాయకులు కూడా ఖిన్నులవుతున్నారు. తమకు ఏ చిన్న అవకాశం వచ్చినా వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నామని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
