యుగానికి ఒక్కడు- అన్న నానుడి మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు విషయంలో అక్షరాలా నప్పుతుంది. చలన చిత్ర సీమలో అనేక మంది ఉద్ధండ నటులు వున్నప్పటికీ.. రాజకీయ రంగంలో కాకలు తీరిన నాయకులు ఉన్నప్పటికీ.. తనదైన శైలిలో వేసిన అడుగులతో తెలుగు వారి గుండెల్లో అన్నగారిగా పదిలమైన చోటు దక్కించుకున్నారు ఎన్టీఆర్. 1923, మే 28న ఉమ్మడి కృష్నాజిల్లాలోని నిమ్మకూరులో జన్మించిన రామారావు.. 1996, జనవరి 18న అమాభినిష్క్రమణం పొందే వరకు.. అనేక సంచలనాలకు వేదికగా మారారు.
40 ఏళ్లకుపైగా సినీరంగంలో రారాజుగా ఎదిగిన ఎన్టీఆర్.. ఇటు రాజకీయ అవనికపైనా.. అంతే స్థాయిలో తన పటిమను ప్రదర్శించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింప చేసిన ఆయన .. అనేక సంచలనాలకు వేదికగా మారారు. నటన పరంగా తిరుగులేని ప్రస్థానం సాధించారు. ఇక, ఆయన సాధించిన రికార్డులను అందుకునే స్థాయి ఇప్పటికీ ఎవరికీ లేకపోవడం గమనార్హం. సాధారణ పాత్రలు ఎవరైనా వేయొచ్చు. కానీ.. ఒక కృష్ణుడు, ఒక రాముడు.. ఒక రావణాసురుడు.. మరోశివుడు.. ఇలా ఏ పౌరాణిక పాత్రను తీసుకున్నా.. నడిచొచ్చిన దేవుడు ఆయన!.
ఇక, రాజకీయంగా కూడా.. పేదలకు అత్యంత సన్నిహితుడైన ఏకైక నాయకుడు కూడా ఎన్టీఆర్ చరిత్రను సొంతం చేసుకున్నారు. 2 రూపాయల కిలో బియ్యం.. మహిళలకు ఆస్తిలో వాటా, కరణాల రద్దు, తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి.. హిందూత్వకు పెద్దపీట.. ఇలా అనేక కోణాల్లో అన్నగారు.. పాలనను ప్రజారంజకం చేశారు. ఇదేసమయంలో రాజకీయంగా.. ఒక విశ్వవిద్యాలయం వంటి టీడీపీని స్థాపించి వేలాది మంది నాయకులను రాష్ట్రానికి అందించారు. బీసీలకు పెద్దపీట వేయడం ద్వారా.. సమాజంలో బడుగులకు రాజ్యాధికారంలో వాటాను పంచిపెట్టారు.
1996, జనవరి 18న భౌతిక దేహాన్ని వదిలి దిగంతాలకు చేరుకున్నా.. నేటికీ.. ఆయన స్ఫూర్తి-కీర్తి.. ఒక్క తెలుగునాటే కాదు.. తెలుగు వారు ఎక్కడున్నా వినిపిస్తుంది. కనిపిస్తుంది కూడా!. ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు.. రూపాయి వేతనం తీసుకున్న ఏకైక సీఎంగా(అప్పటికి) ఆయన పేరుదేశవ్యాప్తంగా వినిపించింది. చిన్నవారైనా గౌరవించే మనస్తత్వం.. అందరికీ బ్రదర్ అని సంబోధించడం.. పేదలకు కూడా గుప్పెడు భూమి ఉండాలంటూ.. కేంద్రంతో పోరాడి మరీ పేదలకు భూములు ఇప్పించిన ఘటనలు వంటివి అన్నగారి కీర్తిని హిమవన్నగాలను మరపించేలా చేసింది.
నేడు(జనవరి 18) అన్నగారి 30వ వర్ధంతి. భౌతికంగా ఆయన మనతో లేకపోయినా.. ఆయన ఆదర్శం.. ప్రజాక్షేత్రంలో పాటించిన విలువలు.. ముఖ్యంగా తెలుగు భాషకు పట్టిన వెలుగు దివిటీలు వంటివి అమేయం.. అజరామరం!!. అందుకే.. అన్నగారు.. యుగ పురుషుడు.. యుగానికి ఒక్కడు.. అంతే!!
Gulte Telugu Telugu Political and Movie News Updates
