1996, జ‌న‌వ‌రి 18 … చ‌రిత్ర‌పై లిఖించ‌ని సంత‌కం!

కొన్ని తారీకులు.. సంవ‌త్స‌రాలు.. కాలంతో పాటు క‌రిగిపోవు. అవి శాశ్వ‌తంగా నిలిచి ఉంటాయి. స‌ద‌రు తారీకులు.. సంవ‌త్స‌రాల‌లో జ‌రిగిన పెద్ద ఘ‌ట‌న‌లైనా..చిన్న ఘ‌ట‌న‌లైనా.. అశేష ప్ర‌జానీకంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తాయి. అలాంటి తారీకుల్లో జ‌న‌వ‌రి – 18, అలాంటి సంవ‌త్స‌రాల్లో 1996 ఒక‌టి.

ఆ రోజు దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఆమాట‌కొస్తే.. అమెరికాకు చెందిన `వాషింగ్ట‌న్ పోస్టు`.. సాధార‌ణంగా.. వెలువరించే.. ఉద‌యం ప‌త్రిక‌కు ఆ రోజు అనుబంధం ప్ర‌చురించింది. ఇక‌, దేశంలోని ద‌క్షిణాది రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ముఖ ప‌త్రిక‌లు కూడా.. ప్ర‌త్యేక అనుబంధాల‌ను ప్ర‌చురించాయి.

ఆ రోజుకు, ఆ సంవ‌త్స‌రానికి అంత ప్రాధాన్యం ఏర్ప‌డంది!. ఇప్ప‌టి మాదిరిగా అప్ప‌ట్లో ఇంట‌ర్‌నెట్ సౌక‌ర్యం చాలా అంటే చాలా త‌క్కువ‌గా ఉండేది. ఇక‌, సోష‌ల్ మీడియా లేనేలేదు. దీంతో జ‌న‌వ‌రి 18, 1996న ఉద‌యం 10 గంట‌ల స‌మయానికి దేశం మొత్తం ప‌త్రిక‌లు ప‌ట్టుకుని నిభిఢాశ్చ‌ర్యంతో చ‌దివింది!. ఏం జ‌రిగింది?! అంటూ.. ఒక‌రికొక‌రు చ‌ర్చించుకున్నారు.

రేడియోలు… టీవీల‌ను పెట్టుకుని వార్త‌ల కోసం వేచి చూశారు. కొన్ని ఛానెళ్లు లైవ్‌లు ప్ర‌సారం చేశాయి. మ‌రికొన్ని అప్‌డేట్‌లు ఇచ్చాయి. ఇంత ప్రాధాన్యం సంత‌రించుకున్న జ‌న‌వ‌రి 18.. చ‌రిత్ర‌లో నిలిచిపోయింది.

దీనికి కార‌ణం.. తెలుగు వారి అన్న‌గారు.. విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నందమూరి తార‌క రామారావు మ‌హాభినిష్క్ర‌మ‌ణం చెంద‌డ‌మే. నిజానికి అన్న‌గారి జీవితంలో ఆ రోజు కూడా సాధార‌ణంగానే సూర్యుడు ఉద‌యించాయి. దైనందిన కార్య‌క్ర‌మాల‌కు.. సిద్ధ‌మ‌య్యారు. వ్యాయామానికి ఉద్యుక్తుల‌య్యారు.

ఇంత‌లో నే హ‌ఠాత్ప‌రిణామం.. గుండెపోటు. ఆ వెంట‌నే సొంత వైద్యుడి రాక‌.. తుదిశ్వాస ఖ‌రారు. దీంతో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా.. దేశ వ్యాప్తంగా ఈ వార్త‌.. దావాల‌నంలా వ్యాపించింది. ఆయ‌న మ‌ర‌ణం కూడా ఓ ప్ర‌ధాన చ‌ర్చ‌కు దారితీసింది. ఏ న‌లుగురు క‌లిసినా.. కాదు, కావాల‌ని క‌లుసుకుని చ‌ర్చించిన సంద‌ర్భం అది.

న‌టుడిగా వెండితెర‌పై అరంగేట్రం చేసిన సామాన్యరైతు బిడ్డ‌.. అంచెలంచెలుగా ఎదిగి.. కాంగ్రెస్ ఆధిపత్యానికి ఎదురునిలిచి.. రాజ‌కీయ అవ‌నిక‌పై తెలుగుదేశం పార్టీని స్థాపించి.. అత్యంత త‌క్కువ స‌మ‌యంలోనే ముఖ్య‌మంత్రి అయి పేద‌ల పాలిట దేవుడుగా మారిన క్ష‌ణాలు మ‌రోసారిస్ఫుర‌ణ‌కు తెచ్చాయి.

ఆయన కేవ‌లం మ‌నిషిగా.. మాత్ర‌మే కాదు, ఒక చ‌రిత్ర పురుషుడిగా వినుతికెక్కారు. జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చ‌విచూశారు. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా నిలిచారు. అందుకే.. జ‌న‌వ‌రి 18, 1996 నేటికే కాదు.. మరికొన్ని శ‌తాబ్దాల‌కు కూడా తెలుగు వారి చ‌రిత్ర‌పై లిఖించ‌ని సంత‌కంగా నిలిచిపోయింది!!