మంత్రి హరీష్ రావు భలే చేశాడే..

తెలంగాణలో టాప్-5 లీడర్లలో ఒకరు హరీష్ రావు. కేటీఆర్‌కు ప్రాధాన్యం పెంచే క్రమంలో హరీష్ రావు స్థాయి తగ్గించడానికి ప్రయత్నం జరిగింది కానీ.. లేదంటే కేసీఆర్‌కు దీటుగా నిలబడగల సత్తా ఉన్నవాడే ఆయన. సిద్ధిపేటలో ఆయనకున్న ఇమేజే వేరు. తెలంగాణలో హైదరాబాద్‌ను మినహాయిస్తే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇదొకటి. ఇక హరీష్ రావుకు ఏ మంత్రిత్వ శాఖ అప్పగించిన అద్భుతంగా ఫలితాలు చూపిస్తుంటారు.

నీటి పారుదల శాఖ మంత్రిగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఏ స్థాయిలో ఉన్నప్పటికీ జనం మధ్యకు వెళ్లారంటే హరీష్ రావు ఒక సామాన్యుడిలా మారిపోతారు. చాలా సులువుగా జనాల్లో కలిసిపోయి వారితో ముచ్చట్లు చెబుతుంటారు. ఈ మధ్య కార్లో వెళ్తూ ఓ ఊరిలో ఆగి మహిళలతో కరోనా గురించి ముచ్చటించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.

తాజాగా హరీష్ రావు మరో సరదా వీడియోతో సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నారు. శనివారం ఆయన తన నియోజకవర్గంలో పర్యటించారు. రంగనాయక సాగర్ నుంచి గోదావరి జలాల్ని విడుదల చేశారు. మెయిన్ కెనాల్‌లోకి నీళ్లు వదిలిన సందర్భంగా హరీష్ రావు చిన్నపిల్లాడైపోయారు. కాలువలోకి దిగి నీళ్లు తీసుకుని వెనుక ఉన్న నాయకుల మీదికి చల్లుతూ సందడి చేశారు. అంతే కాదు.. పక్కనే ఉన్న ఇద్దరు నాయకుల్ని నీళ్లలోకి తోసేశారు. వాళ్లు ఈదుతుంటే నీళ్లు చల్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సందర్భంగా హరీష్ రావు ఓ ఉద్వేగపూరితమైన ట్వీట్ కూడా చేశారు.

‘‘గోదావరి జలాలతో సిద్ధిపేట పురిటిగడ్డ పునీతమైంది. రంగనాయక సాగర్ నుంచి కుడి ఎడమ కాల్వల్లో గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంటే జన్మ ధన్యమైందన్న అనుభూతి కలుగుతోంది. సాగు కోసం ఇక కాలం, కరెంటు కోసం ఎదురు చూపులు చూడనక్కర లేకుండా రైతుల కన్నీటి కష్టాలు తుడిచిన సీఎం కేసీఆర్ గారికి, ఇంజనీర్లకు చేతులెత్తి మొక్కుతున్నా’’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.