ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2 కోట్లను విడుదల చేసింది. రాజధాని ప్రాంతం ఒకప్పుడు బౌద్ధులకు ఆరామంగా ఉండేది. అనేక బౌద్ధ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరిగాయి.
ఈ నేపథ్యంలో 2014 నుంచి 2018 మధ్య అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ‘జ్ఞాన బుద్ధ’ పేరుతో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో బౌద్ధ ఆరామానికి సంబంధించిన అనేక విశేషాలతో పాటు బుద్ధుని భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చుట్టూ హరిత హారాన్ని నిర్మించాలని కూడా ప్రణాళిక వేశారు.
జ్ఞాన బుద్ధ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ స్థాయి బౌద్ధులను ఆకర్షించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. అప్పట్లోనే ఈ ప్రాజెక్టుకు ఐదు ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ప్రస్తుతం ఉన్న 125 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగానే నిర్మించబడింది.
అయితే, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కనపెట్టడంతో ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. జ్ఞాన బుద్ధ ప్రాజెక్టు కూడా మూలన పడింది. అయినప్పటికీ ఈ ప్రాంతానికి పర్యాటకులు వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనిని పూర్తిస్థాయిలో విస్తరించాలని రాష్ట్ర పర్యాటక శాఖ నిర్ణయించింది.
ఇటీవల దీనికి సంబంధించిన విధి విధానాలను పర్యాటక శాఖ రూపొందించింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా జ్ఞాన బుద్ధ ప్రాజెక్టు అభివృద్ధికి రూ. 1.85 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ప్రాంగణాన్ని పునరుద్ధరించనున్నారు.
అదేవిధంగా ప్రత్యేక ధ్యాన మందిరం, గ్రంథాలయం, బౌద్ధుని స్మృతులతో కూడిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. దీనిని ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఏటా సుమారు ఐదు లక్షల మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా జ్ఞాన బుద్ధ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates