ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి వేషాలేస్తే.. ఏరేస్తాం అంటూ.. తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తన సొంత నియోజకవర్గంలో ఏ ఇంటి పై కాకి వాలినా.. రాజకీయం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. ఏ చిన్న ఘటన జరిగినా.. దానిని చిలవలు పలవలు చేసి ప్రచారం చేస్తున్నారని.. ఇక ముందు అలా జరిగితే.. ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తాజాగా `పీఠికాపుర సంక్రాంతి` పేరుతో పిఠాపురంలో ముందస్తు సంక్రాంతి.. వేడుకలను ఆయన ప్రారంభించారు. తొలుత తెలుగు సంప్రదాయాలు ఉట్టి పడేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. కళా రూపాలను వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిఠాపురంలో కాకి ఈక పడినా.. ఏదో జరిగిపోతోందంటూ.. ప్రచారం చేస్తున్నారని.. అవాస్తవాలను వైరల్ చేస్తున్నారని.. ఇది సరికాదని హెచ్చరించారు. ఇలా చేసేవారు ఎంతటి వారైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
చివరకు స్కూల్ పిల్లలు పెన్సిళ్లకోసం కొట్టుకున్నా.. పెద్ద వార్తను చేస్తున్నారని.. మండిపడ్డారు. కానీ.. ఇదే సమయంలో సొంత బాబాయిని చంపినా అది వార్తగా రాదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి వచ్చి గొడవలు చేసేవారికి ఇదే నాహెచ్చరిక అంటూ.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడు చేస్తే.. తాట తీస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఇక, పిఠాపురంలో జరుగుతున్న సంక్రాంతి ఉత్సవాలు.. ఈ పండుగకే ఒక కేరాఫ్‌గా మారాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. “తెలంగాణకు ఆంధ్రా ప్రాంత ప్రజల ప్రేమను తీసుకెళ్లాలి. అక్కడి సోదరీమణులను సంక్రాంతికి ఆహ్వానించి.. వారికి గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని రుచి చూపాలి“ అని పవన్ కల్యాణ్ సూచించారు.
కోడి పందేలు, జూదాలు సంప్రదాయంగా వస్తున్నాయని.. ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు. ఇక, నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన వివరించారు. తనకు అధికారం ఉన్నా లేకపోయినా ఆఖరి శ్వాస వరకు పిఠాపురం ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates