అదేంటి? ఈ వ్యాఖ్యల అంతరార్థం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? ఒకింత ఆశ్చర్యంగా కూడా ఉందా? కానీ.. అధికార పార్టీ వైసీపీలో ఈ వ్యాఖ్యలే హల్‌చల్ చేస్తున్నాయి. త్వరలోనే సీఎం జగన్ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేస్తారని తెలిసిందే. సగం మంది ఇప్పుడున్న వారిని పక్కన పెట్టి.. కొత్తవారికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి జగన్ చెప్పింది కూడా ఇదే. అయితే.. సాధారణంగా .. మంత్రులుగా ఉన్నవారు ఎవరైనా.. తప్పుకొనేందుకు..పదవులు వదులుకునేందుకు ఇష్టపడరు. అవసరమైతే.. వివాదానికైనా దిగుతారు. కుదిరితే బ్రతిమాలుతారు.
కానీ, వైసీపీలో ముగ్గురు నుంచి నలుగురు మంత్రులు తమంతట తామే తప్పుకొనేందుకు రెడీగా ఉన్నార ని అంటున్నారు వైసీపీ సీనియర్లు. అత్యంత రహస్యంగా సాగుతున్న ఈ చర్చ ఆనోటా.. ఈనోటా పడి.. మీడియాకు చేరింది. మంత్రులుగా ఉన్నప్పటికీ.. తమకు పవర్స్ లేవని భావిస్తున్నవారు, తమ నియోజకవర్గంలోనే తమకు విలువ లేకుండా పోతోందని, సీనియర్లు తమపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారని భావిస్తున్న మంత్రులు.. మంత్రిగా ఉన్నా.. ప్రయోజనం లేకుండా పోయింది.. మాకు ఎమ్మెల్యేకు తేడా లేదని వగరుస్తున్నవారు.. ఈ జాబితాలో ఉన్నారని చెప్పుకొంటున్నారు.
విశ్వసనీయ వైసీపీ నేతల సమాచారం మేరకు స్వచ్ఛందంగా పదవులు వదులుకునేందుకు రెడీగా ఉన్న మంత్రుల్లో కడప జిల్లాకు చెందిన కడప ఎమ్మెల్యే, మంత్రి అంజాద్ బాషా, విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి శంకరనారాయణ, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే, మంత్రి రంగనాథరాజుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరి గోల వారిదే .. అన్నట్టుగా పరిస్థితి ఉందని అంటున్నారు సీనియర్ నాయకులు. నియోజకవర్గాల్లోను, ప్రభుత్వ పాలనలోనూ వీరికి పెద్దగా వాల్యూలేదని కూడా అంటున్నారు. ఏదేమేనా.. వీరు జగన్ అడగడమే పాపం.. వదులుకునేందుకు రెడీ అని చర్చించుకుంటుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates