అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో జగన్ మనసులో ఉన్నదే బయట పెట్టారని ప్రత్యర్థి పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో, గతంలో రాజధాని రైతులను తూలనాడి ఇప్పుడు వారి తరఫున వాదిస్తున్నట్టు జగన్ మాట్లాడటం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద జగన్ తాజా వ్యాఖ్యలతో ఐదు కీలక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
1) రాజధాని విషయంలో జగన్ స్టాండ్ ఏమిటి?
అమరావతి విషయంలో జగన్ ఇప్పటికీ ఏ నిర్ణయంపై ఉన్నారన్నది ప్రధాన ప్రశ్న. గత ఏడాది సెప్టెంబరు వరకు, అలాగే అంతకుముందు వైసీపీ కీలక నేతలు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు జగన్ అమరావతిలోనే ఉంటారని, అక్కడి నుంచే పాలన ప్రారంభిస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం జగన్ మళ్లీ అమరావతిపై విమర్శలు చేస్తున్నారు.
2) రాజధాని రైతులపై నిజంగా ప్రేమ ఉందా?
ఇటీవల జగన్ రైతుల గురించి మాట్లాడేటప్పుడు భావోద్వేగంగా స్పందించారు. చంద్రబాబు రైతులకు న్యాయం చేయలేదని ఆరోపించారు. అయితే వైసీపీ హయాంలోనే రైతులకు ఎక్కువ నష్టం జరిగిందన్న వాస్తవాన్ని ఎలా ఖండిస్తారు? రైతులపై కేసులు పెట్టడం, వేధింపులు, పోలీసులతో కొట్టించడం జరిగిన విషయానికి జగన్ ఏమంటారు?
3) రాజధాని భూముల విషయంలో ద్వంద్వ వైఖరా?
రాజధాని భూసమీకరణ విషయంలో జగన్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మొదట 33 వేల ఎకరాలు అవసరమన్నారు. ఆ తర్వాత అంత భూమి ఎందుకని ప్రశ్నించారు. ఇప్పుడు రెండో దశ భూసమీకరణ విషయంలో కూడా అదే వాదన వినిపిస్తున్నారు. మరి రాజధాని అంశాన్ని జగన్ ఎలా చూడాలనుకుంటున్నారు?
4) మూడు రాజధానుల విధానమేనా?
గత ఎన్నికల్లో ప్రజలు మూడు రాజధానుల అజెండాను స్పష్టంగా తిరస్కరించారు. ఈ విషయంలో జగన్ ప్రస్తుత వైఖరి ఏమిటి? భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి వస్తే మూడు రాజధానుల విధానానికే కట్టుబడి ఉంటారా? లేక అమరావతిని అంగీకరిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
5) అమరావతి స్కామ్ ఆరోపణలు నిజమా?
అమరావతిలో స్కామ్ జరుగుతోందని జగన్ మరోసారి ఆరోపించారు. గతంలో కూడా ముందస్తు వ్యాపారం జరిగిందంటూ పేర్లతో సహా ఆరోపణలు చేశారు. కానీ అప్పట్లో అవి నిరూపించలేకపోయారు. ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ కోసమే రాజధాని విస్తరణ జరుగుతోందన్న వ్యాఖ్యలను జగన్ నిరూపించగలరా?
ఈ ఐదు ప్రశ్నలకు జగన్ స్పష్టమైన సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates