ఔను! టీడీపీ నేతల వ్యవహారం గురించి.. ఆ పార్టీకి ఎంతో ఇష్టమైన.. ఆ పార్టీ నేతలు నిత్యం ఫాలో అయ్యే సోషల్ మీడియాలోనే ఇలా కామెంట్లు కుప్పలు తెప్పలుగా కురుస్తున్నాయి. తమ్ముళ్లూ.. ఇది తగునా?! అంటూ.. ప్రశ్నల వర్షం కురుస్తోంది. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అంటే.. టీడీపీలో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. పార్టీ ప్రారంభం నుంచి ఉన్నవారు.. మధ్యలో వచ్చిన వారు.. ఇలా చాలా మది ఉన్నారు. వీరిలో ఎంతో మంది పదవులు అనుభవించారు. పార్టీ తరఫున అధికారం చలాయించారు. ఈ విషయంలో తప్పులేదు. పార్టీ వారికి అవకాశం ఇచ్చింది. వారు పదవులు చేపట్టారు.
అయితే.. పార్టీ అంటే.. కేవలం పదవులు అనుభవించడం వరకే పరిమితమా? మరిఆ పార్టీకి ఏమీ చేయా ల్సిన అవసరం లేదా? అనేది కీలక ప్రశ్న. ప్రస్తుతం.. పార్టీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. గత ఏడాది ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ ఎప్పుడెప్పుడు పుంజుకుంటుందా.. గ్రాఫ్ ఎప్పుడు పెరుగుతుందా ? అని టీడీపీ అధినేత చంద్రబాబు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు వివిధ రూపాల్లో ఆయన హైదరాబాద్‌లో ఉన్నా.. ఎక్కడ ఉన్నా.. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి గతంలో పదవులు అనుభవించిన వారు ఏం చేస్తున్నారు? 70ఏళ్లు నిండి కూడా ఇంకా చంద్రబాబే చిన్న చిన్న విషయాలు కూడా చూసుకోవాలా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు.
ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే.. పార్టీలో పదవులు అనుభవించిన వారు.. గత ఏడాది ఎన్నికల్లో ఓడిన తర్వాత.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. సరే! ఏదో ఓటమి పరాభవం నుంచి ఇంకా తేరుకోలేదులే అని సరిపెట్టుకోవచ్చు. కానీ, తమ అవసరం వచ్చేసరికి లేదా.. తమ వ్యాపారాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అనుకునే సరికి మాత్రంగంటల తరబడి మీడియా మీటింగులు పెడుతున్నారు. జగన్ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. మరి పార్టీ కోసం ఏనాడైనా.. ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్కరైనా బయటకు వచ్చారా? అంటే ప్రశ్నార్థకంగా మారింది.
ఉదాహరణకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, అనంతకు చెందిన జేసీ కుటుంబం, పరిటాల ఫ్యామిలీ.. అంతా కూడా తమకు నొప్పి కలిగితే.. మీడియా ముందుకు వచ్చారు తప్ప.. పార్టీ కోసం మైకు పట్టిన పరిస్థితి ఈ ఏడాదిన్నర కాలంలో ఎక్కడా కనిపించకపోవడాన్నే .. సోషల్ మీడియాజనాలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలే కాదు.. పార్టీలను కూడా వాడుకునే వదిలేసే టైపేనా? అని ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇప్పటికైనా తమ్ముళ్లు మారతారో లేదో చూడాలి.