భారీ టాస్క్ భుజాన వేసుకున్న ప‌వ‌న్.. స‌క్సెస్ అయ్యేనా.. ?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పాల‌న ప‌రంగా భారీ టాస్కులు భుజాన వేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీల‌ను అభివృద్ధి చేయ‌డంతోపాటు.. గిరిజ‌న ప్రాంతాల్లో ర‌హ‌దారులు కూడా నిర్మిస్తున్నారు. ఇక‌, ఎక్క‌డ స‌మ‌స్య ఉంటే అక్క‌డ ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. మ‌రోవైపు.. తాజాగా ఆయ‌న తీర ప్రాంత ప‌రిర‌క్ష‌ణ స‌హా ప‌చ్చద‌నం పెంచేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిపై కొన్నాళ్లుగా క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసిన ఆయ‌న ఇప్పుడు కార్యాచ‌ర‌ణ‌కు రంగంలోకి దిగారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న ఏమేర‌కు స‌క్సెస్ అవుతార‌న్న‌ది చూడాలి. ప్ర‌ధానంగా తీర ప్రాంత అడవుల రక్షణ.. ఆక్రమణల నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. గ్రేట్ గ్రీన్ వాల్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలని పవన్ కల్యాణ్ నిర్ణ‌యించారు. ఇది భారీ ప్రాజెక్టు. రాష్ట్రంలో 900 కిలో మీట‌ర్ల‌ పైచిలుకు తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం మొత్తాన్నీ ప‌చ్చ‌ద‌నంతో నింపాలంటే.. భారీగా నిధులు కూడా అవ‌స‌ర‌మే. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఇది సాధ్య‌మేనా? అనేది ప్ర‌శ్న‌.

తీర ప్రాంతం వెంబడి ఉన్న మొక్కలకు భద్రత కల్పించడం, అటవీ భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూసే బాధ్యతను కూడా భుజాన వేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే తీర ప్రాంత నివాసిత ప్ర‌జ‌ల‌కు ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నారు. కానీ, ఇది సాధ్య‌మేనా? అనేది ప్ర‌శ్న‌. సామాన్యుల‌ను ద‌రిదాపుల్లోకి కూడా రాకుండా.. తీర ప్రాంతంలోనూ హ‌ద్దులు ఏర్పాటు చేసుకున్న ప‌రిస్థితి బాప‌ట్ల‌లోని సూర్య‌లంక బీచ్‌లో క‌నిపిస్తోంది. దీనిపై ఇప్ప‌టి వ‌రకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేకపోయారు.

ఇక‌, రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపడంప‌వ‌న్ పెట్టుకున్న కీల‌క‌ లక్ష్యాల్లో ఒకటి. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లాలని కూడా ఆయ‌న భావిస్తున్నారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులను చేప‌ట్ట‌నున్నారు. సుమారు 974 కిలోమీటర్ల పొడవు ఉన్న తీర ప్రాంతాన్ని విపత్తుల నుంచి రక్షించడంతోపాటు రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్ర‌య‌త్నించ‌డం మంచిదే అయినా.. నిధులు, ప‌ర్య‌వేక్ష‌ణ‌, నాయ‌కుల దూకుడు వంటి వాటిని ఎదుర్కొని ల‌క్ష్య సాధ‌న‌లో ఏమేర‌కు ముందుకు సాగుతార‌న్న‌ది ఇప్పుడు కీల‌క అంశం. చూడాలి మ‌రి ఏం చేస్తారో.. !