హద్దు దాటిన రోజా: ‘పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి’

నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారులను, పోలీసులను కూడా బెదిరించిన విషయం తెలిసిందే. తాట తీస్తా, తోలు తీస్తా, సప్త సముద్రాలకు అవతల ఉన్నా తీసుకువచ్చి శిక్షలు వేస్తా అంటూ జగన్ హెచ్చరించారు.

ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నాయకురాలు జబర్దస్త్ రోజా ఎంట్రీ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చారు. వచ్చీ రాగానే అధికారులపై విరుచుకుపడ్డారు. పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలను రోజా పరామర్శించారు. పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్యల కేసుల్లో వీరు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో పోలీసులకు లొంగిపోగా, తర్వాత వీరిని జైలుకు తరలించారు.

ఈ క్రమంలో జగన్ స్వయంగా జైలుకు వచ్చి వీరిని పరామర్శిస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పటివరకు జగన్ స్పందించలేదు.

తాజాగా రోజా జైలుకు వచ్చి పిన్నెల్లి బ్రదర్స్‌ను పరామర్శించారు. సుమారు 20 నిమిషాల పాటు వారితో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పిన్నెల్లి సోదరులపై ప్రభుత్వం కక్ష తీర్చుకుంటోందని తెలిపారు. అందుకే వారికి జైలులో అన్నం కూడా పెట్టడం లేదని రోజా ఆరోపించారు.

ప్రస్తుతం పోలీసులు ఖాకీ దుస్తులు వదిలేసి పసుపు చొక్కాలు ధరించారని విమర్శించారు. ఇప్పుడు ఎంత మంది వైసీపీ నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారో, అంత మందిపైనా తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని రోజా హెచ్చరించారు.

ఈ క్రమంలోనే పోలీసులు ఏదైనా నీళ్లు లేని బావి చూసుకుని అందులో దూకి చావాలని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు వ్యవస్థను చూసి అందరూ నవ్వుతున్నారని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే, ఏపీ పోలీసు వ్యవస్థ అట్టడుగు స్థాయికి దిగజారిందని వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసు వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికను సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితలు చూసి సిగ్గుపడాలని అన్నారు.

పవన్‌పై సెటైర్లు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి రోజా సెటైర్లు వేశారు. ఆయన సీమ ప్రయోజనాలు కాపాడతానని గతంలో పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, రాయలసీమ ప్రాంతానికి సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు అన్యాయం చేస్తుంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా ఏం చేస్తున్నారని నిలదీశారు.

జగన్ హయాంలో సీమ ప్రాజెక్టుకు 960 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని రోజా తెలిపారు.