తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సీజన్‌లో మొత్తం 5 రోజుల పాటు మాత్రమే ఈ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) నిర్ణయంతో ఐదు రోజుల పాటు జరిగిన సమావేశాలు మంగళవారం సాయంత్రంతో ముగిసినట్టు చైర్మన్ ప్రకటించారు.
అనంతరం.. నిరవధికంగా మండలిని వాయిదా వేశారు. ఈ ఐదు రోజుల్లో మొత్తం దాదాపు 20 గంటల పాటు మండలి కార్యకలాపాలు సాగాయి. వాస్తవ సమయం 19 గంటల 52 నిమిషాల వరకు మండలి సాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
అయితే.. ఈ ఐదు రోజుల సమావేశాల్లో బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, మండలి సభ్యురాలు కవిత చేసిన ప్రసంగం హైలెట్‌గా నిలిచింది. అనేక విషయాలను ప్రస్తావిస్తూ.. ఈ నెల 5న సోమవారం ఆమె సుదీర్ఘంగా మండలిలో ప్రసంగించారు.
గత ప్రభుత్వ పాలనపైనా.. బీఆర్ ఎస్ నేతలపైనా.. ఆ పార్టీలో తనకు జరిగిన అన్యాయంపైనా ఇలా.. అనేక విషయాలను కవిత ప్రస్తావించారు. అంతేకాదు.. ఒక దశలో భావోద్వేగానికి కూడా గురై కన్నీరు పెట్టుకున్నారు. ఇక, తాను సొంత పార్టీ పెట్టనున్నట్టు కూడా కవిత ఈ సమావేశాల్లోనే ప్రకటించడం గమనార్హం.
ఇక, శాసన సభలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలకు కొనసాగింపుగా మండలిలోనూ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రధానంగా జల వివాదాలు.. కృష్ణాజలాల అంశంపై శాసన సభలో చోటు చేసుకున్న చర్చే ఇక్కడ కూడా జరిగింది. మొత్తంగా.. ఐదురోజుల మండలి భేటీలో కవిత ప్రసంగమే హైలెట్ కావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates