ఏపీ రాజధాని అమరావతి రైతుల విషయంలో మరోసారి సీఎం చంద్రబాబు తన మనసు చాటుకున్నారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను ఆయన పరిష్కరించే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి శూల ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపునకు అంగీకరించారు. నిజానికి ఈ సమస్య పై గతంలో రైతుల నుంచిపెద్ద ఎత్తున ఫిర్యాదులు, విన్నపాలు వచ్చాయి. వీటిని తాజాగా సీఎం చంద్రబాబు పరిష్కరించారు.
మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సీఆర్డీఏ 57వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎవరైనా సరే.. వాస్తు ప్రకారమే చూసుకుంటారని.. రైతులు కోరినదానిలో తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. వారికి సంతోషంగా భూములు ఇవ్వాలని సూచించారు.
దీంతో 112 ఫ్లాట్లకు ప్రత్యామ్నాయంగా మరోచోట ఫ్లాట్లను కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. ఇక, ఇదేసమయంలో మరో కీలక సమస్యపై కూడా సీఎం చంద్రబాబు చర్చించారు. రాజధాని లో భూమిలేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లను ఆ కుటుంబంలో మైనర్లయిన అనాథలకు వర్తింప చేయాలని సూచించారు. ఈ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.
రైతులను ప్రియార్టీగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనా బీచ్(చెన్నైలో)గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాద నలకు కూడా సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక హబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని.. ఇదేసమయంలో రాజధాని ప్రాంతంలో అందుబాటులో ఉన్న కృష్ణానదిని కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సూచించారు. దీనిలో భాగంగా వాటర్ ఫ్రంట్, జెట్టీలు, టూరిజం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్ స్కేప్ పనులను చేపట్టనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates