కొండగట్టు ఆంజనేయస్వామి సాక్షిగా.. తెలంగాణ మీద ప్రేమ, ఇష్టం తప్ప నాకు ఇంకోటి ఉండదు.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. దీంతో కొద్ది రోజుల క్రితం రేగిన ఓ వివాదానికి సంబంధించి ఆయన ఇలా క్లారిటీ ఇచ్చేశారు. కొందరు నాయకులు కోనసీమ సౌందర్యాన్ని పొగడటం వల్లే ఇప్పుడు ఆ ప్రాంతానికి “దిష్టి” తగిలిందని ఆయన అన్నట్లు ఒక వివాదం మొదలైంది.
దీనిపై కొందరు తెలంగాణ నేతలు రియాక్ట్ అయ్యారు. వివాదం పెద్దది అవుతుందని భావించిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరిస్తున్నారని, సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీయవద్దని కోరింది. ఈ రోజు పర్యటనలో పవన్ కూడా తెలంగాణపై తనకు ఉన్న అభిప్రాయాలను వెల్లడించారు.
ఎలాంటి పోరాటం అయినా సరే చేసే పోరాట స్ఫూర్తిని దేశానికి చూపించిన నేల ఇది అని ఆయన కొనియాడారు. “తెలంగాణ పోరాటాన్ని వామపక్షాలు, సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు కలిపి చేశారు. రజాకార్లు ఒక మతానికి చెందినవారైనా కూడా సాయుధ పోరాటమే చేశారు తప్ప మత పోరాటం చెయ్యలేదు. అది తెలంగాణ గొప్పతనం.” అని పవన్ పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ‘ఆంధ్రప్రదేశ్ లోనే నిస్వార్ధంగా పని చేసిన వాడిని, తెలంగాణ నుండి నేను ఏం ఆశిస్తాను! సినిమాల్లోనే అంతులేని అభిమానాన్ని చూపించారు అంతకు మించి ఏం కావాలి!..’ అని ఆయన భావోద్వేగంతో అన్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం జనసేన ఐడియాలజీ అని పవన్ అన్నారు.
ఏ రాష్ట్రం అయినా తమ రాష్ట్రంతో పాటు దేశాన్ని గౌరవించడం ముఖ్య ఉద్దేశం అని ఆయన తెలిపారు. నేను పార్టీ పెట్టడానికి నాలో చైతన్యం నింపింది, నాకు ధైర్యం ఇచ్చింది తెలంగాణ నేల. నాకు తెలంగాణ పోరాట స్ఫూర్తి అంటే చాలా ఇష్టం. తెలంగాణలో పుట్టిన పార్టీ మనది. ఇక్కడ ప్రజలకు అండగా నిలుద్దాం. తెలుగు ప్రజల ఐక్యత కోసం కలిసి పని చేద్దాం.. తెలంగాణకు బలమైన యువ నాయకత్వం అవసరం ఉంది. మీ స్థాయి, మీ ప్రాంతాన్ని బట్టి పోరాటం చేయండి.. అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates