అంజ‌న్న‌ సన్నిధిలో పవన్ – ధర్మశాలకు శంకుస్థాపన

తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లాలో ఉన్న‌ ప్ర‌సిద్ధ‌.. కొండ‌గ‌ట్టు ఆంద‌జ‌నేయ‌స్వామి(అంజ‌న్న‌)ని ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌ర్శించుకున్నారు. శ‌నివారం.. ఉద‌యం.. మంగ‌ళగిరి నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జ‌గిత్యాల జిల్లాలోని కొండ‌గ‌ట్టుకు చేరుకున్నారు.

ఆల‌య అధికారులు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌న వెంట‌..ఏపీకి చెందిన ప‌లువురు నాయ‌కులు కూడా పాల్గొన్నారు. అనంత‌రం.. అంజ‌న్న‌ను ద‌ర్శించుకున్న డిప్యూటీ సీఎం.. ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. స్వామివారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

అనంతరం.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆర్థిక స‌హ‌కారంతో నిర్మిస్తున్న ధ‌ర్మ‌శాల‌, దీక్షా మండ‌పాల నిర్మాణానికి.. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ శంకు స్థాప‌న చేశారు. వీటి నిర్మాణాల‌ను 35 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చుకానున్నాయి. ఈసొమ్మును తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం స‌మ‌కూర్చ‌నుంది.

గ‌తంలో కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌ప్పుడు.. ప‌లువురు భక్తులు.. త‌న‌ను ఈసౌక‌ర్యాలు ఏర్పాటు చేయాల‌ని కోరుకున్నార‌ని.. ఈ నేప‌థ్యంలోనే వాటి నిర్మాణానికి.. టీటీడీతో చ‌ర్చించిన‌ట్టు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవల వెల్ల‌డించారు. తాజాగా ఆయా నిర్మాణాల‌కు స్వ‌యంగా ఆయ‌నే శంకుస్థాప‌న చేశారు.

ఆది నుంచి అనుబంధం..

కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆది నుంచి అనుబంధం ఉంది. ఆయ‌న పార్టీ పెట్టిన త‌ర్వాత‌.. అనేక ప‌ర్యాయాలు.. అక్కడ ప‌ర్య‌టించారు. స్వామిని ద‌ర్శించుకున్నారు. వారాహి యాత్ర‌ను ఏపీలో ప్రారంభించ‌డానికి ముందు కూడా.. ఆయ‌న కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి ఆల‌యానికి వెళ్లి.. వారాహి ర‌థానికి ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. త‌ర్వాత కూడా ఆయ‌న అనేక ప‌ర్యాయాలు కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌ను ద‌ర్శించుకున్నారు.