డీసీఎం పవన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దోస్తీ ఇప్పటిది కాదు

వారిద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు. రాజకీయంగా పార్టీలూ వేరే. అయినా వారి మధ్య స్నేహబంధం మాత్రం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఒకరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాగా, మరొకరు తెలంగాణలోని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న దీక్షా విరమణ మండపం, 96 గదులతో కూడిన వసతి సముదాయానికి ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

“కొండగట్టు అంజన్న నాకు పునర్జన్మను ఇచ్చాడు” అని అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చానని గుర్తు చేశారు. ఆ రోజు తన జీవితంలో జరిగిన ప్రమాద సమయంలో పక్కనే ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తి తన చిరకాల మిత్రుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమేనని పవన్ పేర్కొన్నారు. కొండగట్టు ఆలయం తన మిత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండటం తనకు మరింత ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు.

అదే విధంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, తాను యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు తరచూ పవన్ కళ్యాణ్‌ను కలిసేవాడినని చెప్పారు. మొట్టమొదటిసారి కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చిన సందర్భంలో తాను పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నానని, ఆ సమయంలో జరిగిన ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడటాన్ని కళ్లారా చూశానని గుర్తు చేసుకున్నారు.

అంజన్న ఆశీస్సుల వల్లే పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం, తాను చొప్పదండి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం సాధ్యమైందని వ్యాఖ్యానించారు. గతంలో పవన్ కళ్యాణ్ ప్రారంభించిన కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కార్యక్రమాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులైనా, రాజకీయాలకు అతీతంగా తమ చిరకాల స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడిన ఈ సందర్భం అక్కడ ఉన్నవారిలో విశేష ఆసక్తిని కలిగించింది.