2026.. ఎన్నికల నామ సంవత్సరమే!

నూతన సంవత్సరం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలను తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు రాజకీయాలు దుమ్ము రేపనున్నాయి. ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో 2026 తొలి ఆరు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రం అసోం, కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న రాష్ట్రం పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా 72 రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 2026 మొత్తం ఎన్నికల నామ సంవత్సరంగా మారనుంది.

తమిళనాడు

ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే + కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వచ్చే ఏప్రిల్‌లో అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. దీంతో దీనికి ముందే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఓబీసీ నాయకుడు సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతిగా చేసింది.
ఇక తమిళనాడులో ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకే బీజేపీతో కలిసి ఉండగా, విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కగళం స్వతంత్రంగా బరిలోకి దిగనుంది. డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది.

పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అధికారంలో ఉన్నారు. వచ్చే మేతో అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. దీంతో ఇక్కడ కూడా గడువుకు ముందే ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.
ఈ రాష్ట్రంపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి చొరబాటు దారుల కారణంగా ఉపాధి అవకాశాలు తగ్గాయని బీజేపీ ప్రచారం చేస్తోంది. చొరబాటు దారులకు మమత అండగా ఉన్నారని బీజేపీ నేతలు ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారు.

కేరళ

మరో కీలక రాష్ట్రం కేరళలో కూడా 2026లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. మొత్తం అసెంబ్లీ స్థానాలు 140.
ఈ రాష్ట్రంలోనూ పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. నటుడు గోపీ కృష్ణన్ తొలిసారి బీజేపీ తరఫున పార్లమెంటుకు ఎన్నిక కావడం, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం తెలిసిందే. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి ఊతమిస్తుందని చర్చ జరుగుతోంది.

పుదుచ్చేరి

కేంద్ర పాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ + బీజేపీ కలిసి ప్రభుత్వం నడుపుతున్నాయి. ఇక్కడ కూడా ఏప్రిల్‌తో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సీఎం రంగస్వామి మరియు బీజేపీ మధ్య విభేదాలు తలెత్తుతున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

అసోం

ఈశాన్య రాష్ట్రం అసోంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. వచ్చే మేతో అసెంబ్లీ గడువు ముగియనుంది. తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇతర చిన్న పార్టీలతో కలిసి అడుగులు వేస్తోంది. ఏదేమైనా 2026 నిజంగా ఎన్నికల నామ సంవత్సరమేనని చెప్పాలి.