ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గత నెల చివర్లో కోనసీమ రైతులను పరామర్శించిన పవన్ కళ్యాణ్, అక్కడి కొబ్బరి చెట్లు మరియు సాగు వివరాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా కొబ్బరి సాగు అధికంగా ఉండే శంకరగుప్తం మండలం సహా పలు మండలాల రైతులతో భేటీ అయిన ఆయన వారి కష్టాలను విన్నారు.
ఈ సందర్భంగా సముద్రపు నీటి ప్రభావంతో తాము నష్టపోతున్న పరిస్థితిని రైతులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన, అవసరమైన పనులు చేసి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆధునిక పద్ధతిలో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శంకరగుప్తంలో జరిగిన కార్యక్రమంలో ఆ ప్రాంత రైతులు, అలాగే రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.20 కోట్ల 77 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. దీని ద్వారా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడనుంది. సముద్రం నుంచి వచ్చే ఉప్పునీరు సుమారు 80 శాతం వరకు అడ్డుకట్ట పడనుండగా, కొబ్బరి తోటలకు రక్షణ లభించనుంది. ఇది రైతులకు ఎంతో ప్రయోజనకరమని పవన్ కళ్యాణ్ తెలిపారు.
రాజోలు పర్యటన సందర్భంగా 45 రోజుల్లో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కేవలం 35 రోజుల్లోపే సమస్యకు పరిష్కారం చూపడం గమనార్హం.
రైతుల్లో హర్షం
తాజా పరిణామాలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పవన్ కళ్యాణ్ పరిష్కరించే ప్రయత్నం చేయడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.
దేశంలో కొబ్బరి ఉత్పత్తిలో కేరళ తర్వాత ఏపీ రెండో స్థానంలో ఉంది. అయినప్పటికీ ఇన్నేళ్లుగా రైతులకు ప్రభుత్వాల నుంచి సరైన మద్దతు లభించలేదని వారు వాపోతున్నారు. ముఖ్యంగా సముద్రపు నీరు తన్నుకొచ్చి కొబ్బరి సాగును నాశనం చేయడం, ఉప్పునీటి కారణంగా చెట్లు ఎండిపోవడం, సాగు తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
తాజాగా ఈ సమస్యలకు పవన్ కళ్యాణ్ పరిష్కారం చూపడంతో కోనసీమ రైతుల్లో ఆశలు చిగురించాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates