కేసీఆర్ వద్దకు రేవంత్, నిలబడని కేటీఆర్!

రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ, సందర్భం వచ్చినప్పుడు రాజకీయాలను పక్కనపెట్టి ప్రత్యర్థులను సైతం గౌరవించాల్సిన పరిస్థితులుంటాయి. పవన్ కల్యాణ్ చెప్పినట్లు ఎక్కడ నెగ్గాలో కాదో…ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినోడే అసలైన రాజకీయ నాయకుడు.

తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఆ కోవలోకే వస్తానని నిరూపించుకొనీ ప్రశంసలు అందుకున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చినా సరే కనీస గౌరవం చూపించకుండా కేటీఆర్ విమర్శలపాలయ్యారు.

కొద్ది రోజులుగా కేసీఆర్, రేవంత్ లు ఒకరి పార్టీ పై ఒకరు కారాలు, మిరియాలు నూరుకుంటున్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ రోజు శాసన సభలో కూడా ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం తప్పదని అంతా అనుకున్నారు.

అయితే, సీన్ రివర్స్ అయింది. సభలో కేసీఆర్ దగ్గరకు స్వయంగా వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నమస్కరించారు. అంతేకాదు, షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఈ సమయంలో కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మినహా మిగతా బీఆర్ఎస్ సభ్యులంతా ముఖ్యమంత్రిని గౌరవిస్తూ తమ సీట్ల నుంచి లేచి నిల్చున్నారు.

ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేటీఆర్, కౌశిక్ రెడ్డిలపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ వైరం ఉన్నప్పటికీ రాజకీయాలను పక్కనబెట్టి తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ను రేవంత్ గౌరవించారని, కానీ, కనీసం ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం ఇచ్చి రేవంత్ వచ్చినప్పుడు కేటీఆర్, కౌశిక్ రెడ్డి నిల్చొని ఉంటే హుందాగా ఉండేదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రేవంత్ అంటే తనకు పీకల దాకా కోపం ఉందని కేటీఆర్ చెప్పారని, అది ఈ రోజు కనిపించిందని విమర్శిస్తున్నారు. గౌరవప్రదమైన శాసన సభలో సభాధ్యక్షుడైన రేవంత్ కు కనీస గౌరవం ఇవ్వకుండా కేటీఆర్ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ శ్రేణులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నాయి.