‘తెలంగాణ విడిపోయాక తిరుపతిలో ఇబ్బందులు’

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తిరుపతిలో తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులకు దర్శనం సందర్భంగా తగినంత ప్రాధాన్యత దక్కడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఆ విషయంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభలో ప్రస్తావించారు. అంతేకాదు, తిరుపతిలో తెలంగాణ భవన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తిరుపతిలో ఆల్రెడీ కర్ణాటక భవన్, తమిళనాడు భవన్ ఉన్నాయని కమలాకర్ గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు తిరుపతికి వెళ్లినప్పుడు వారికి బస చేసేందుకు ఇబ్బంది లేదని అన్నారు. కానీ, తెలంగాణ ప్రజా ప్రతినిధులకు మాత్రం ఇబ్బంది ఎదురవుతోందని, అందుకే తిరుపతిలో తెలంగాణ భవన్ కూడా నిర్మిస్తే బాగుంటుందని, తెలంగాణ నేతలు వెళ్లినప్పుడు బసతోపాటు ప్రాధాన్యత కూడా ఉంటుందని అన్నారు. మరి, ఈ ఆలోచన కార్యరూపం దాలుస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.