జాతీయ కాంగ్రెస్ పార్టీ.. స్వాతంత్యోద్యమం నుంచి నేటి వరకు కూడా అనేక ఉత్థాన పతనాలు ఎదుర్కొన్న పార్టీ ఇది. అతి పురాతన పార్టీనే అయినా.. ఒకప్పుడు నవనవోన్మేషంగా ముందుకు సాగింది. అయితే.. 2014 తర్వాత.. దిగంతాల నుంచి దిగులు దిగులుగా.. దిగజారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
అయితే.. తమకు ఇవన్నీ కొత్తకాదని .. ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎప్పటికైనా మరోసారి పుంజుకుంటామని.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారం మాదేనని చెబుతున్నారు. రాజ్యాంగం, విలువలు, ప్రజల స్వేచ్ఛ పరిరక్షణకు పార్టీ కట్టుబడి ఉంటుందని కూడా తాజాగా మరోసారి ఉద్ఘాటించారు.
ఇక, ఆదివారం(డిసెంబరు 28) కాంగ్రెస్ పార్టీ 140వ పుట్టినరోజు. జాతీయ కాంగ్రెస్ పార్టీగా.. అవతరించకముందు..బ్రిటీష్ వారిపై పోరాటం చేసే సమయంలోనే.. కాంగ్రెస్ ఏర్పడింది. అప్పట్లో ఇది ఉద్యమ పార్టీ. తర్వాత తర్వాత.. రాజకీయ పార్టీగా అవతరించింది.
ఇక, దీనిలోనూ అనేక చీలికలు వచ్చాయి. చివరకు `ఇందిరా కాంగ్రెస్` మాత్రమే జాతీయస్థాయిలో నిలబడింది. 140వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. పార్టీ ఢిల్లీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. జెండా ఎగురవేశారు. పార్టీ లక్ష్యం ఏంటో చెప్పారు. దిశానిర్దేశం చేశారు. ప్రజల కోసం-ప్రగతి కోసం.. పార్టీ పూర్తిస్థాయి అంకిత భావంతో పనిచేస్తుందన్నారు.
అయితే.. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 140వ వ్యవస్థాపక వేడుకలు జరిగినా.. దేశవ్యాప్తంగా ఆతరహా కార్యక్రమాలు ఎక్కడా చేయకపోవడం గమనార్హం. చేయలేదా.. లేక.. చేసినా.. నాయకులు రాలేదా? అనేది ప్రశ్న. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లోనూ పెద్దగా సందడి కనిపించలేదు. న్యూఇయర్ సమీపిస్తున్న నేపథ్యంలో నాయకులు ఆదివారం సందడిలో ఉండడం గమనార్హం.
ఇక, ఏపీలో ఎక్కడా ఆ ఛాయలు కనిపించలేదు. కర్ణాటకలో మాత్రం బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో కొంత సందడి కనిపించింది. ఇక, ఉత్తరాది రాష్ట్రాలన్నీ దాదాపు బీజేపీ కనుసన్నల్లోనే ఉండడంతో అక్కడ పెద్దగా సందడి లేకుండా పోయింది.
ఉత్థానం నుంచి పతనం వరకు..
కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ల చరిత్రలో అనేక ఉత్థానాలను చూసింది. వరుసగా అధికారంలో ఉండడం.. దేశవ్యాప్తంగా తన హవాను చలాయించడం తెలిసిందే. అయితే.. 1980ల తర్వాత.. ప్రాంతీయ పార్టీల ఆవిర్భావంతో కాంగ్రెస్ ప్రాభవం కొంత మేరకు తగ్గుతూ వచ్చింది. ఇక, బీజేపీ రాకతో పార్టీ ఆత్మరక్షణలో పడింది.
మరీ ముఖ్యంగా దుందుడుకు నిర్ణయాలు.. కూటమి కట్టి కూడా.. కూటమి పార్టీలకు విలువ ఇవ్వకపోవడం వంటివి కాంగ్రెస్ చేసుకున్న స్వయంకృతాపరాధాలు. దీంతోనే 2014 తర్వాత.. ఆ పార్టీ ఉత్థానం(పైస్థాయి) నుంచి పతనం దిశగా వడివడిగా జారిపోయింది. ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లోనే పార్టీ అధికారంలో ఉంది. 1) కర్ణాటక, 2) తెలంగాణ, 3) హిమాచల్ ప్రదేశ్. ఇంతకు మించి దేశంలో ఒకప్పుడు ఉన్న హవా ఇప్పుడు లేదనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates