ఒక ఎదురు దెబ్బ మనిషిని మారుస్తుంది. ఒక ఓటమి పార్టీలకు కనివిప్పు కలిగిస్తుంది. మరి అలాంటి ఇలాంటి ఓటమి కాకుండా.. ఊహించని ఘోర పరాజయం ఎదురైతే.. ఆ పార్టీ ఇంకెంత మారాలి? ఎన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి? సహజంగానే సమూలంగా అధినేత నుంచి నాయకుల వరకు అందరూ మారతారు. మారాలని చూస్తారు కూడా. కానీ.. ఏపీ ప్రతిపక్ష(ప్రధాన కాదు) పార్టీ వైసీపీలోను.. ఆ పార్టీ అధినేత జగన్‌లోనూ ఎలాంటి మార్పూ కనిపించలేదు. ఎలాంటి ఆత్మ విచారం కూడా బయటకు రాలేదు. 2025లో ఏ మాత్రం మార్పు లేని..రాని నాయకుడిగా జగన్ మిగిలిపోయారు.
11 సీట్లకు పరిమితం అయిన తర్వాత.. సహజంగా ఏ పార్టీ అయినా.. సమీక్షించుకుంటుంది. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుని వాటిని సరిచేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. కానీ. ఆతరహా ప్రయత్నం వైసీపీలో ఎక్కడా కనిపించ లేదు. పైగా.. మొండి తనం.. పెంకితనం.. తన పట్టిందే జరిగాలన్న సంకల్పం జగన్‌లో కొనసాగింది. ప్రజల్లోకి వచ్చే విషయాన్ని పక్కన పెడితే.. కనీసం పార్టీ సమస్యలపైనా ఆయన స్పందించలేకపోయారు. తమకు వద్దని మొత్తుకుంటున్నప్పటికీ.. ఓ కీలక నేతను తాడేపల్లిలో కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది.
ఇక, ఈ ఏడాది ఎమ్మెల్సీల నుంచి నాయకుల వరకు చాలా మంది పార్టీని వదిలి వెళ్లిపోయారు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీ వైపు నాయకులు మొగ్గు చూపుతారు. కానీ, ఈవిషయం తెలిసిన తర్వాత.. ఆ పార్టీ అధినేతగా ఎవరైనా వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. కానీ.. జగన్ దీనికి భిన్నంగా వ్యవహరించారు. ఆది నుంచి తాను పాటిస్తున్న సిద్ధాంతాన్నే ఆయన ఈ ఏడాది ఇంత కష్టంలోనూ పాటించారు. ఇక, పార్టీపరంగా మెరుపులు ఎక్కడా కనిపించలేదు. పైగా.. దూకుడు ప్రదర్శించిన నాయకులు జైలు పాలయ్యారు. మద్యం కుంభకోణం నుంచి సామాజిక మాధ్యమంలో దూషణల కేసుల వరకు నాయకులను వెంటాయి. వెంబడించాయి. కొందరిని జగన్ పరామర్శించారు.
ఇక, వ్యక్తిగతంగా కుటుంబానికి అంతే దూరం పాటిస్తూ వచ్చారు. సహజంగా గత ఎన్నికల్లో ఓటమికి సొంత సోదరి షర్మిల కూడా రీజనేనన్నది పార్టీలో ఉన్న అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఆమెతో చర్చలు జరుపుతారని.. శాంతించేలా చేస్తారని అనుకున్నారు. కానీ.. జగన్ ఆదిశగా ఇప్పటి వరకు అడుగులు వేయలేదు. 2025లో పెద్దగా చెప్పుకోదగిన విషయాలేమీ లేకపోవడం గమనార్హం. ప్రజల మధ్యకు వస్తున్నానని చెబుతూనే.. పార్టీ కార్యకర్తలు, నాయకులకు షెడ్యూల్ ఇచ్చి.. తాను బెంగళూరుకు వెళ్లిపోయిన ఘటనలు పార్టీలో చర్చనీయాంశం అయ్యాయి. ఇక, అసెంబ్లీ సమావేశాల విషయంలో అదే మంకు పట్టును కొనసాగించారు. తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదా.. ముఖ్యమంత్రి మాట్లాడిన సమయం మేరకు మైకు ఇస్తేనే తప్ప.. సభకు రానని భీష్మించారు. సొ.. ఎలా చూసుకున్నా.. 2025లో వైసీపీలోను.. ఆ పార్టీ అధినేతలోనూ పెద్దగా ఎలాంటి మార్పులూ కనిపించలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates