ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోనే ఉన్నారు

తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రింత సెగ పెరుగుతోంది. ఒక‌వైపు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో జంపింగ్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్య‌లు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీని ఆత్మ‌ర‌క్ష‌ణలో ప‌డేస్తున్నాయి. 2023 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న 10 మంది ఎమ్మెల్యేలు… త‌ర్వాత కాలంలో బీఆర్ఎస్‌ను వ‌దిలి అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే.. ఇది వివాదం కావ‌డం.. న్యాయ‌ప‌ర‌మైన వ్య‌వ‌హారం వ‌ర‌కు వెళ్ల‌డం.. తెలిసిందే.

మొత్తంగా 10 మందిలో ఐదుగురు స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు చేప‌ట్టిన విచార‌ణకు హాజ‌రై.. తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. మిగిలిన ఐదుగురిలో ఇద్ద‌రు క‌డియం శ్రీహ‌రి, దానం నాగేంద‌ర్‌లు మాత్రం అస‌లు విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. ఇక‌, మిగిలిన ముగ్గురిలో తాజాగా జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి విచార‌ణ‌కు వ‌చ్చేందుకు స‌మ‌యం కోరిన సంజ‌య్‌.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌కలం రేపుతున్నాయి.

బుధ‌వారం సాయంత్రం ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌.. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నాన‌ని చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపాయి. ఉంటే త‌ప్పేంట‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇప్పుడు తాజాగా జ‌గిత్యాల నుంచి బీఆర్ఎస్ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్న సంజ‌య్ కూడా ఇదే బాట‌లో న‌డిచారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నాన‌ని గురువారం ఆయ‌న వ్యాఖ్యానించారు.

అంతేకాదు, దీనిలో త‌ప్పేముందని ఎదురు ప్ర‌శ్నించారు. అభివృద్ధి చేస్తున్న ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిలిచాన‌ని.. దీనిలో ఎలాంటి త‌ప్పులేద‌ని వ్యాఖ్యానించారు. దీంతో బీఆర్ ఎస్ పార్టీ నాయ‌కులు ఖంగు తిన్నారు. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు రానుంది.