‘ప్రియాంక గాంధీ ప్రధాని పదవికి అర్హురాలు’

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ, లోక్‌స‌భ‌లో విప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీపై ఆయ‌న సొంత బావ, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి రాబ‌ర్ట్ వాద్రా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ పేరు ఎత్త‌కుండానే కీల‌క కుంప‌టి రాజేశారు. పార్టీలో ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి త‌న భార్య, వ‌య‌నాడ్‌(కేర‌ళ‌) ఎంపీ ప్రియాంక గాంధీ అర్హురాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్ల‌మెంటులో బ‌ల‌మైన గ‌ళం వినిపించార‌ని చెబుతూ.. కాంగ్రెస్ పార్టీని ఆమె బ‌లంగా లోక్‌స‌లో ముందుకు తీసుకువెళ్లార‌ని వాద్రా చెప్పారు. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ.. ఇమ్రాన్ మ‌సూద్ కూడా ఇవే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు.

`కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ప్రియాంక గాంధీని ప్ర‌ధాని అభ్యర్థిగా ప్ర‌క‌టిస్తేనే.. పార్టీకి ఆద‌ర‌ణ ఉంటుంది. అప్పుడే పార్టీ విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం వ‌స్తుంది.“ అని ఇటీవ‌ల పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల ముగింపు సంద‌ర్భంగా మ‌సూద్ చేసిన వ్యాఖ్య‌లు కల‌క‌లం రేపాయి.

అయితే.. ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న సొంత‌మంటూ.. కొంద‌రు నాయ‌కులు వివాదం పెర‌గ‌కుండా మౌనం పాటించారు. అదేస‌మ‌యంలో ప్రియాంక గాంధీ కూడా మౌనంగా ఉండిపోయారు. తాజాగా ఈ వ్యాఖ్య‌లను కోట్ చేస్తూ.. ప్రియాంక భ‌ర్త‌, రాహుల్ బావ రాబ‌ర్ట్ వాద్ర కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

“పార్టీలో ఒక చ‌ర్చ జ‌రుగుతోంది. అది నాదాకా కూడా వ‌చ్చింది. నా వైఫ్‌(ప్రియాంక‌)ను ప్ర‌ధానిగా చూడాల‌ని కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నారు. చాలా చోట్ల ఇలాంటి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల పార్ల‌మెంటులో కూడా ప్రియాంక బ‌ల‌మైన గ‌ళం వినిపించారు.“ అని వాద్రా వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. తాను కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చే విష‌యంపై ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ విష‌యంపై కూడా పార్టీలో చ‌ర్చ సాగుతోంద‌ని.. కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నార‌ని వాద్రా చెప్పారు. దీనిపై పార్టీలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోర‌నున్న‌ట్టు తెలిపారు. ఒకే ఇంట్లో ఇద్ద‌రు(భార్యాభ‌ర్త‌) రాజ‌కీయాల్లో ఉండ‌డం త‌ప్పుకాద‌ని.. అంతిమంగా ప్ర‌జాసేవే ల‌క్ష్య‌మ‌ని వాద్రా వ్యాఖ్యానించారు. కాగా.. రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందించాల్సి ఉంది.