ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాటలు విని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కామెంట్లు చేశారు. పాలమూరులో చెరువులను బాగు చేయాలని కేంద్రానికి తాము అధికారంలో ఉన్నప్పుడు లేఖలు రాశామని చెప్పారు. అయితే.. చంద్రబాబు మాటలు విని..కేంద్రం తమకు అన్యాయం చేసిందని.. కనీసం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలకులు శనిలా దాపురించారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా పాలమూరు ప్రజలు ఘోష పడ్డారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అప్పట్లో కూడా పాలమూరుకు అన్యాయమే జరిగిందన్నారు. దీంతో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. మేలు చేయాలని భావించామని.. కానీ, చంద్రబాబు చక్రాలు-బొంగరాలు తిప్పి.. పాలమూరుకు అడ్డుపడ్డారని విమర్శించారు. చంద్రబాబు మాటలు విని.. కేంద్రం తమను ఇబ్బంది పెట్టిందని కూడా వ్యాఖ్యానించారు. దీంతో పాలమూరులో పనులు నిలిచిపోయాయన్నారు.
వాస్తవం ఏంటి?
కేసీఆర్ వ్యాఖ్యలను కొద్దిసేపు పక్కన పెడితే.. చంద్రబాబు అధికారంలో ఉన్నది 2014-19 మధ్య. అప్పట్లో కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆసమయంలో బీజేపీతో చంద్రబాబు చెలిమి చేసి..తమకు అన్యాయం చేశారన్నది కేసీఆర్ వాదన. అయితే.. వాస్తవానికి బీజేపీతో చంద్రబాబు చెలిమి చేసింది.. కేవలం 3 ఏళ్లు. 2017 చివరి త్రైమాసికం నుంచి ఆయన కేంద్రంతో విభేదించారు. ప్రత్యేక హోదా విషయం రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ విషయంపై కేంద్రంతో చంద్రబాబు కొట్లాటకు దిగారు. ఇక, 2019 తర్వాత.. 2024 వరకు జగనే అధికారంలో ఉన్నారు.
మరి.. ఆ మూడు సంవత్సరాల కాలంలో నిజంగానే చంద్రబాబు అడ్డుపడి ఉంటే.. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేలా కేంద్రం చక్రాలు-బొంగరాలు తిప్పి ఉంటే.. ఆ తర్వాత.. కాలంలో కేసీఆర్ ఏం చేశారు? అనేది ప్రశ్న. అంతేకాదు.. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు.. కూడా కేసీఆర్ ఎంపీలు మద్దతు తెలిపారు. మరి ఆ సమయంలో ఎందుకు ప్రస్తావించలేదన్నది ప్రశ్న.
ఇక, ఆతర్వాత.. తెలంగాణ వడ్లు కొనడం లేదని కేంద్రంతో జగడం పెట్టుకున్నది స్వయానా కేసీఆరే. ఆయన ఇందిరా పార్కు వద్ద ముఖ్యమంత్రి హోదాలో నిరసన కూడా వ్యక్తం చేశారు. సో.. ఈ పరిణామాలను గమనిస్తే.. చంద్రబాబు అడ్డుకు-పాలమూరుకు లింకు పెట్టడం సరికాదన్నది పరిశీలకులు చెబుతున్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates