ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల ఎఫెక్ట్ జగన్‌పై భారీగా పడుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. “`సూపర్ సిక్స్` తో జగన్ కు దిమ్మ తిరుగుతోంది“ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. పార్టీ ఎంపీలతో కలిసి లంచ్ బ్రేక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. జగన్ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉందన్నారు. పార్టీలో నాయకులు ఎవరూ ఆయనకు సహకరించడం లేదని చెప్పారు.
ఈ సమయంలో జగన్‌కు ఏం చేయాలో తెలియడం లేదని.. అందుకే కోటి సంతకాల పేరుతో నాటకాలకు తెరదీశారని చంద్రబాబు విమర్శించారు. కానీ, ఆయన పార్టీ ఎంపీ గురుమూర్తే.. వైద్య కళాశాలలను పీపీపీకి ఇస్తే తప్పులేదని.. అలా ఇస్తే మెరుగైన ఫలితాలు కూడా వస్తాయని పార్లమెంటులో నివేదిక సమర్పించారని చంద్రబాబు తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ ఎంపీలు కూటమి ఎంపీలకు కూడా వివరించి.. పార్లమెంటు వేదికగా జగన్ నాటకాన్ని చెప్పాలని.. అక్కడోమాట.. ఇక్కడో మాట మాట్లాడుతున్న తీరును ఎండగట్టాలని వ్యాఖ్యానించారు.
వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో అమలు చేస్తున్న రాష్ట్రాలు అనేకం ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని ప్రోత్సహిస్తోందని చంద్రబాబు చెప్పారు. పార్లమెంటులో ఈ విషయాన్ని లేవనెత్తే దమ్ములేక వైసీపీ రాష్ట్రంలో డ్రామాలకు తెరదీసిందని దుయ్యబట్టారు. ఈ డ్రామా కూడా విఫలమైందని.. అందుకే మళ్లీ బెంగళూరుకు పోయేందుకు రెడీ అయ్యాడని వ్యాఖ్యానించారు.
పీపీపీ విధానాన్ని వదులుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ, ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్రల్లో కూడా.. పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించారని గుర్తు చేశారు. ఈ విషయాలను పార్లమెంటులో ప్రస్తావించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates