ఆ కోటి మాట ఏమైంది సీఎం సార్‌!?

అధికార వైసీపీ నేత‌లు ఒక విష‌యాన్ని చాలా గోప్యంగా తెర‌మీదికి తెస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిస్థితిని ప‌రిశీలిస్తే.. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేల‌కు నిధులు అంద‌డం లేదు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి ప‌నులు చేసుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. పైగా సీఎం కూడా వారికి అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేదు. ఏదైనా ఉంటే.. ఇంచార్జ్ మంత్రితో మాట్లాడాలి. లేక‌పోతే.. రాజ‌కీయ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్నారెడ్డి కి మొర‌పెట్టుకోవాలి. పాపం.. చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే పంథాను అనుస‌రించారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వారికి రూపాయి కూడా రాలేదు.

పైగా.. వ‌లంటీర్లు అన్నీ చేస్తున్నారు. ప్ర‌జ‌ల్లో ప్ర‌బుత్వంపై సంతృప్తి ఉంది.. కాబ‌ట్టి.. మీరు చెప్పేది నిజం కాద‌ని సజ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి మొహం మీదే చెప్పేస్తున్నారు. లేదంటే.. మీ చిట్టా బ‌య‌ట‌కు తీయ‌మంటారా? అంటూ.. బెదిరిస్తున్న ధోర‌ణిలో మాట్లాడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే ప‌రిస్థితి అడ‌క‌త్తెరలో పోక‌చ‌క్క‌గా మారింది. వాస్త‌వానికి రాష్ట్ర వ్యాప్తంగా ర‌హ‌దారులు బాగోలేవు. చిన్న వాన చినుకుకే మునిగిపోతున్నాయి. బుర‌ద‌మ‌యం అవుతున్నాయి. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు కూడా వీటి పున‌ర్ నిర్మాణం కోసం డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ నేప‌థ్యంలోనే వారు జ‌గ‌న్ ఇచ్చిన సంచ‌ల‌న హామీని తెర‌మీదికి తెస్తున్నారు. ప‌రోక్షంగా వారు సోష‌ల్ మీడియాను వినియో గించుకుని జ‌గ‌న్‌పై ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. తొలి అసెంబ్లీ భేటీలో సీఎం జ‌గ‌న్ ఓ సంచ‌ల‌న హామీ ఇచ్చారు. ప్ర‌తి ఎమ్మెల్యేకు త‌న ప్ర‌భుత్వం నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి నిధుల కింద ఏటా రూ.కోటి ఇస్తుంద‌ని.. ప్ర‌క‌టించారు. అంతేకాదు..ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబును ఉద్దేశించి కూడా.. ఇదే హామీ ఇచ్చారు. చంద్ర‌బాబు నాయుడు గారు, ఆయ‌న త‌మ్ముళ్ల‌కు కూడా కోటి రూపాయ‌లు ఇస్తాం.. అధ్య‌క్షా.. మా పేరు చెప్పాల్సిన ప‌నిలేకుండానే ప‌నులు చేయించుకోవ‌చ్చు అని ప్ర‌క‌టించారు.

క‌ట్ చేస్తే.. ఏడాదిన్న‌ర అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ హామీ ని జ‌గ‌న్ నిల‌బెట్టుకోలేదు. ఇప్పుడు దీనినే వైసీపీ ఎమ్మెల్యేలు ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ.. జ‌గ‌న్‌పై ఒక‌విధ‌మైన యుద్ధానికి సిద్ధ‌మ‌య్యార‌ని చెప్పాలి. ఆ కోటి మాట ఏమైంది సీఎం సార్‌!? అంటూ.. సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్న‌లు వ‌స్తుండ‌డం వెనుక వైసీపీ నేత‌ల వ్యూహం ఉంద‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.