ఉండి టాక్: రఘురామ సత్తా తెలుస్తోందా..?

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని ఉండి నియోజకవర్గం నుంచి సీటు దక్కించుకుని విజయం సాధించిన రఘురామకృష్ణరాజు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. సాధారణంగా ఇలాంటి పదవుల్లో ఉన్నవారు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. దీంతో నియోజకవర్గంలో వారు డైల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో కోన రఘుపతి కూడా ఇలానే వ్యవహరించడంతో బాపట్లలో ఆయన గ్రాఫ్ తగ్గిపోయింది. ఏ సమస్యపై ప్రజలు కలిసినా ఆయన చేయలేకపోయారు.

ఈ నేపధ్యంలో గతంలో జరిగిన విషయాన్ని గమనిస్తున్న రఘురామ తన నియోజకవర్గంపై పట్టు పెంచుకునే దిశగా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరం కాకుండా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గానికి దూరంగా ఉండకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయితే పింఛన్ల పంపిణీ తదితర కార్యక్రమాలకు దూరంగా ఉన్నా వాటిని మానిటరింగ్ చేస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ప్రధానంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరును రఘురామ నిరంతరం కనిపెడుతున్నారు. ఎక్కడ తేడా జరిగినా ఆయన ఎంట్రీ ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలుసుకుని కొన్ని చోట్ల సొంత నిధులు కూడా ఖర్చు చేస్తున్నారు. తక్షణం జరుగుతున్న పనులను, పరిష్కరించాల్సిన సమస్యలను ఆయన రాసుకుని వాటికి ప్రాధాన్యం పెంచుతున్నారు. నిజానికి బలమైన టీడీపీ కేడర్ ఉన్న ఉండి నియోజకవర్గంలో వరుసగా ఆ పార్టీనే విజయం దక్కించుకుంటోంది.

దీనిని రఘురామ కాపాడుకుంటున్నారు. ఎక్కడ వర్గ పోరు లేకుండా తనకు సీటు ఇచ్చిన మంతెన రామరాజుతోనూ ఆయన కలివిడిగా వ్యవహరిస్తున్నారు. తనను గెలిపించారన్న భావనను ఎక్కడా వదిలిపెట్టకుండా చూసుకుంటున్నారు. ఇది రఘురామ గ్రాఫ్‌ను పటిష్టంగా ఉండేలా చూస్తోంది. అంతేకాదు ప్రజల సమస్యలను పరిష్కరించడం ద్వారా ఆయన మంచి నాయకుడిగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు. నియోజకవర్గంలో ఒంటరిగా పర్యటించడం, అధికారులను పర్యవేక్షించడం ద్వారా తన సత్తాను నిరూపించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తన సీటును పటిష్టంగా ఉంచుకునేలా వ్యవహరిస్తుండడం గమనార్హం.