దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నెల 13వ తేదీన మెస్సీ పశ్చిమ బెంగాల్ తో పాటు తెలంగాణలో పర్యటించారు. ఆ రోజు ఉదయం అక్కడి సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ కొద్దిసేపు మాత్రమే కనిపించి వెళ్లాడని ఆయన అభిమానులు ఆగ్రహం చెందారు. పలు రాష్ట్రాల నుంచి ఆయన మ్యాచ్ చూసేందుకు వచ్చామని, ఆయన పది నిముషాలు కూడా స్టేడియంలో ఉండలేదన్నారు.
మెస్సీ వెనుదిరిగిన వెంటనే స్టేడియంలో కుర్చీలు విరగ్గొట్టారు. వాటర్ బాటిళ్లను విసిరి వేశారు. ఈ పరిణామాలతో సీఎం మమతా బెనర్జీ సైతం మెస్సీకి, ఫుట్బాల్అభిమానులకు క్షమాపణలు చెప్పారు. అయితే ఇదే అంశం ఇప్పుడు గందరగోళం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజకీయ, పరిపాలనా రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర క్రీడల మంత్రి అరూప్ బిస్వాస్ తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన రాజీనామా ఆమోదించడంతో పాటు, ఈ ఘటనపై విచారణ జరగాలని స్పష్టం చేశారు. రాజీనామా ద్వారా బిస్వాస్ స్వయంగా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
దీంతో పాటు ప్రభుత్వం కూడా పరిపాలన పరమైన చర్యలకు దిగింది. డీజీపీ రాజీవ్ కుమార్, బిధాన్‌నగర్ పోలీస్ కమిషనర్ ముకేశ్ కుమార్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భారీగా జనసమూహాన్ని నియంత్రించడంలో వైఫల్యం, నిర్వాహకులతో సమన్వయం లేకపోవడంపై 24 గంటలలోపు వివరణ ఇవ్వమని ఆదేశించింది.
సాల్ట్‌లేక్ స్టేడియం సీఈవో దేవ్ కుమార్ నందన్‌ను పదవి నుంచి తొలగించారు. అలాగే, ఈవెంట్ నిర్వహణ బాధ్యత వహించిన డీసీపీ అనిష్ సర్కార్‌ను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. మరింత స్వతంత్ర, పారదర్శక దర్యాప్తు కోసం నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ చోటు చేసుకోకుండా ఉన్నత స్థాయి చర్యలు తీసుకోవడం ప్రభుత్వ భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates