నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ తీరు ఇది. మాజీ ఎంపీ, ఏపీ ఉపసభాపతి రఘురామ కృష్ణమరాజుపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సునీల్‌కుమార్ విచారణ నిమిత్తం గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. ఉదయం 10.45 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మధ్యలో ఒక గంట భోజన విరామం ఇచ్చి ఆయనను విచారించారు.
ఇద్దరు వీఆర్వోల సమక్షంలో వీడియో రికార్డింగ్‌తో ఆయన విచారణ జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయనను పలు ప్రశ్నలు అడగ్గా అన్నింటికీ అరకొర సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. అసలు ఈ కేసులో మీకు సంబంధం ఏమిటి..? ఎందుకు అతన్ని కొట్టాల్సి వచ్చిందని అడిగారు. గుండెలపై కూర్చుని ఊపిరాడకుండా చేయాలని ఎవరైనా పెద్దలు చెప్పారా..?
రఘురామ విచారణలో ఉన్నప్పుడు ముసుగు వేసుకుని వచ్చిందెవరు..? మీకు తెలియకుండా కిందస్థాయి వారు ఎవరైనా ఇటువంటి చర్చకు పాల్పడి ఉంటే దానిపై మీరు ఏదైనా నివేదిక తెప్పించుకున్నారా..? వంటి ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. విచారణ అధికారిగా ఎస్పీ దామోదర్ ఉన్నారు. ఇందులో కొన్ని ప్రశ్నలకు మాత్రమే సునీల్‌కుమార్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అసలు ఈ అంశంపై తనకు ఏం తెలియదు అన్నట్లు ప్రవర్తించారని సమాచారం.
నాటి వైసీపీ ప్రభుత్వంలో రఘురామ కృష్ణమరాజు ఎంపీగా ఉన్నప్పుడు 2021లో ఆయనను ఏపీ సీఐడీ పోలీసులు రాజద్రోహం ఆరోపణల కింద అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో తనను తీవ్రంగా హింసించారని, ఈ క్రమంలో తన కాళ్లకు గాయాలయ్యాయని రఘురామ ఆరోపించారు.
ఈ విషయంపై ఆయన కోర్టును ఆశ్రయించగా, అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఆ సమయంలో సీఐడీ అదనపు డీజీగా పనిచేసిన సునీల్‌కుమార్‌పైనే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రఘురామకు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ వేగం పుంజుకుంది. ప్రస్తుతం ఈ కేసులోనే సునీల్‌కుమార్‌ను విచారణకు పిలిపించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు విచారణను ఎదుర్కొంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates