కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి ఇదే సమస్య పట్టి పీడిస్తోంది. గెలుపుకు బాధ్యతలు తీసుకునే వారుండరు కానీ అధికారానికి మాత్రం వెంపర్లాడుతారు. తాజాగా తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికి రెండుసార్లు రాజీనామా చేసింది నిజమే కానీ ఈసారి మాత్రం కొత్త అధ్యక్షుడిని నియమించుకోవాల్సొచ్చేట్లే ఉంది అధిష్టానానికి. గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యతగా ఉత్తమ్ రాజీనామా చేశారు.
ఇంకా ఉత్తమ్ రాజీనామాను అధిష్టానం ఆమోదించలేదు కానీ అప్పుడు అధ్యక్ష పదవి తనకంటే తనకంటు నేతల మధ్య పోటీ మాత్రం పెరిగిపోతోంది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అందరికన్నా రేసులో ముందున్నారు. రేవంత్ తో పాటు మాజీమంత్రి దుద్దిళ్ళు శ్రీధరబాబు కూడా అధ్యక్షపదవికి రెడీ అంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఎప్పటి నుండో రేసులో ఉన్నారు. ఈమధ్యనే ఎంఎల్ఏ జగ్గారెడ్డి తనకేమి తక్కువంటు రెడీ అయిపోయారు.
వీళ్ళందరు చాలదన్నట్లుగా తాజాగా సీనియర్ నేత విహెచ్ కూడా బరిలోకి దూకారు. ఈయన సమైక్య రాష్ట్రంలోనే పిసీపీ అధ్యక్షునిగా చేశారు. అయినా సరే మళ్ళీ టీపీసీసీ బాధ్యతలు కావాలంటున్నారు. పార్టీకి పనిచేసి ఎన్నికల్లో అభ్యర్ధులను గెలిపించాలంటే చాలా మంది అసలు కనబడరు. కానీ పదవులు కావాలంటే మాత్రమే అందరు పోటీ పడతారు. ఉన్న ఒక్క అధ్యక్షపదవిలో అధిష్టానం ఎవరినో ఒకిరిని మాత్రమే నియమించగలుగుతుంది. అంటే వీరిలో ఎవరిని నియమించినా మిగిలిన వాళ్లందరు మళ్ళీ అధ్యక్షునికి వ్యతిరేకతమైపోతారు.
అధికారంలో ఉన్నపుడు పదవుల కోసం గొడవలు పడ్డారంటే అర్ధముంది. ప్రతిపక్షంలో కూర్చుని కూడా పార్టీ పదవుల కోసం గొడవలు పడుతున్నారంటే వీళ్ళని ఏమనాలి ? పైగా పెద్ద రాష్ట్రానికి అధ్యక్షునిగా పనిచేసిన వీహెచ్ కూడా మళ్ళీ రెడీ అయిపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది. మొన్నటి దుబ్బాక ఉపఎన్నికలో గానీ నిన్నటి గ్రేటర్ ఎన్నికల్లో కానీ పార్టీ అభ్యర్ధుల గెలుపుకు వీళ్ళల్లో ఎంతమంది కష్టపడ్డారు ? రేవంత్ తప్ప మిగిలిన నేతలు ప్రచారంలో ఎక్కడా కనబడలేదు. బాధ్యతల్లో వెనకుంటు పదవులకు మాత్రం పోటీలు పడుతున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి ఇలాగుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates