తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఫలితాలు నిన్న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల ఫలితాల సందర్భంగా జరిగిన కొన్ని ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లక్కీ డ్రా, లాటరీ, బొమ్మా బొరుసు పద్ధతులలో గెలిచిన అభ్యర్థులు కొందరైతే….ఒక్క ఓటు తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకున్న అభ్యర్థులు మరికొందరు. అమెరికా నుంచి వచ్చి వేసిన తన ఒక్క ఓటుతో కోడలిని గెలిపించిన మామ వార్త హాట్ టాపిక్ గా మారింది.
లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ పంచాయతీలో ముత్యాల శ్రీ వేద సర్పంచ్ బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారం కూడా బాగానే చేశారు. అయితే, ఆమె ప్రత్యర్థి హర్ష స్వాతి నుంచి శ్రీ వేదకు గట్టి పోటీ ఎదురవుతున్నట్లు కనిపించింది. దీంతో, శ్రీ వేద మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి హుటాహుటిన అమెరికా నుంచి వచ్చారు. పోలింగ్ కు 4 రోజుల ముందు ఇండియాలో ల్యాండ్ అయిన ఇంద్ర కరణ్ రెడ్డి ఓటు శ్రీ వేదను గెలిపించింది.
మొత్తం 426 ఓట్లకుగానూ 378 పోల్ కాగా… శ్రీ వేదకు 189, హర్షస్వాతికి 188 ఓట్లు పోలయ్యాయి. ఒక ఓటు చెల్లలేదు. శ్రీ వేద ఒక్క ఓటు తేడాతో గెలిచారు. అయితే, కేవలం ఇంద్ర కరణ్ రెడ్డి వేసిన ఒక్క ఓటు శ్రీ వేదను గెలిపించిందని శ్రీ వేద కుటుంబ సభ్యులు, స్థానికులు భావిస్తున్నారు. 2 నెలల క్రితం అమెరికాలోని తన కుమార్తె వద్దకు వెళ్లిన ఇంద్ర కరణ్ రెడ్డి మరి కొద్ది రోజులు అమెరికాలో ఉండాలనుకున్నారు. అయితే, ఎన్నికల్లో తన కోడలికి గట్టి పోటీ ఎదురవుతోందని తెలుసుకొని ముందుగానే వచ్చేశారు.
దీంతో, అమెరికా నుంచి వచ్చి కోడలిని గెలిపించిన మామ అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ఇక, శ్రీ వేద కంటే ముందు ఆయన కుటుంబం నుంచి ముత్యాల నారాయణరెడ్డి 1972లో సర్పంచిగా గెలుపొందారు. 2013లో శ్రీ వేద చిన్నమ్మ ముత్యాల రజిత సర్పంచ్ గా విజయం సాధించారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీ వేద 2025లో గెలిచారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates