కేరళ రాష్ట్రంలో తొలిసారి బీజేపీ విజయం దక్కించుకుంది. కేరళలోని రాజధాని నగరం తిరువనంతపురంలో తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 50 స్థానాలు దక్కించుకుని అతి పెద్దపార్టీగా అవతరించింది. దాదాపు 45 ఏళ్ల తర్వాత.. బీజేపీ విజయం దక్కించుకోవడం ఒక ఎత్తు అయితే.. ఇక్కడి బలమైన కమ్యూనిస్టు కోటలను బద్దలు కొట్టి కమల వికాసం జరగడం మరో ఎత్తు. దీంతో బీజేపీనాయకులు సంబరాలు చేసుకున్నారు. అయితే.. ఇదేసమయంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మళ్లీ పల్టీలు కొట్టింది. ఉన్న స్థానాలను కూడా కోల్పోయింది. దీంతో ఆ పార్టీ సహజంగానే బాధలో ఉంటుంది.
కానీ.. ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ మాత్రం బీజేపీకిశుభాకాంక్షలు చెప్పారు. 100 కిలోల స్వీట్లను బీజేపీ కార్యాలయాలకు పంపిస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి పుండుమీద కారం చల్లినట్టు అయింది. తిరువనంతపురం కార్పొరేషన్ పరిధిలో 101 కార్పొరేటర్ వార్డులు ఉన్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 50, అధికార కమ్యూనిస్టు పార్టీ సీపీఐ నేతృత్వంలో ఎల్‌డీఎఫ్ కూటమి 29, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 19 వార్దులను దక్కించుకున్నాయి. మరో 3 ఇతరులు విజయం సాధించారు.
ఈ పరిణామాలు.. బీజేపీలో భారీ ఆనందాన్ని నింపాయి. వచ్చే ఏడాది కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ తమకు సానుకూల సంకేతంగా భావిస్తోంది. వాస్తవానికి గత 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్క పార్లమెంటు స్థానంలో విజయం దక్కించుకుంది. అలాంటిది స్వల్ప కాలంలోనే పుంజుకుని కార్పొరేషన్‌లో విజయం సాధించింది. ఈ విజయంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. 45 ఏళ్ల అరాచకాలను ప్రజలు సహించలేకే తమవైపు మొగ్గు చూపారని ఆయన వ్యాఖ్యానించారు. కేరళ ప్రజలకు మంచి రోజులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఇక, దీనికి ముక్తాయింపుగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. బీజేపీ విజయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఆయన కూడా 45 ఏళ్ల అరాచక పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజలు మార్పు దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పడానికి ఇది ఉదాహరణ అని తెలిపారు. “అధికార పక్షం చేస్తున్న అక్రమాలను చాలా సార్లు ప్రశ్నించాను. అయినా.. వారిలో మార్పు కనిపించలేదు. ఇప్పుడు ప్రజలే మారారు“ అని థరూర్ వ్యాఖ్యానించారు. ఈసందర్భాన్ని పురస్కరించుకుని 100 కేజీల మిఠాయిలు పంపనున్నట్టు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates