టీడీపీ అధినేత చంద్రబాబు వేస్తున్న వ్యూహాలు.. పార్టీలోనే కాకుండా రాజకీయంగా కూడా చర్చకు దారితీస్తున్నాయి. గత ఏడా ది ఎన్నికలకు ముందు వేసిన వ్యూహాలు ఒక్కటి కూడా ఫలించలేదు. తర్వాత కూడా పార్టీని పుంజుకునేలా చేయడంలో ఆయన అనుసరించిన వ్యూహాలపై.. పార్టీ పదవుల పంపకంలో చేపట్టిన.. సమీకరణలపైనా ఇదే తరహా అభిప్రాయం పార్టీ సీనియర్ నేత ల్లోనూ.. సానుభూతి పరుల్లోనూ కనిపించింది. ఇక, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల విషయంలోనూ చంద్రబాబువేస్తున్న అడు గులు విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ ఎన్నిక టీడీపీకి అత్యంత కీలకంగా మారింది. గత ఏడాది ఎన్నికల తర్వాత.. రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఉప పోరు ఇదే. దీనిని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అన్ని పార్టీలకన్నా ముందుగానే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ తరఫున పనబాక లక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. దాదాపు 2 లక్షల ఓట్ల పైచిలుకు తేడాతో ఆమె ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయినా సరే.. మళ్లీ చంద్రబాబు పనబాకకే పగ్గాలు అప్పగించారు. అందరికన్నా ముందుగానేఆమెకు ఇక్కడి టికెట్ ప్రకటించి.. గ్రూపు రాజకీయాలకు, ఆశావహుల నిరసనలకు చెక్ పెట్టారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఇక్కడ ప్రచార బాధ్యతల విషయంలో మాత్రం చంద్రబాబు చేస్తున్న ప్రయోగంపై విమర్శలు వస్తున్నా యి.
తిరుపతిలో పనబాకను గెలిపించే బాధ్యతను ప్రధానంగా ఇద్దరికి అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకరు నెల్లూరు జిల్లా సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు.. వంగలపూడి అనిత లకు చంద్రబాబు ఇప్పటికే దిశానిర్దేశం చేశారని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా అనిత.. తిరుపతిలో మకాం వేశారు.. రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి వచ్చిన అనిత.. స్థానిక పరిస్థితులను అధ్యయనం చేశారు. అదే సమయంలో సోమిరెడ్డి కూడా తిరుపతి పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. అయితే.. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే.. ఇప్పటికి ఐదుసార్లు తననుతాను గెలిపించుకోలేక పోతున్న సోమిరెడ్డి.. పనబాక విజయానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తారనేది ప్రశ్న.
అదేవిధంగా గత ఏడాది ఎన్నికల్లో అనిత విఫలమయ్యారు. ఈమెకు తిరుపతి గురించి ఏం తెలుసునని పగ్గాలు అప్పగించారనేది మరో కీలక ప్రశ్న. పైగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రత్యేక వర్గంగా ఉన్నారు. ఆమె తన వారికి పార్టీలో ప్రాధాన్యం దక్కలేదని అలకబూనారు. ఇక్కడ పార్టీలో అంతో ఇంతో బలం ఉన్న నాయకురాలిగా సుగుణమ్మకు ప్రాధాన్యం ఉంది. అయితే.. ఈమెను పక్కన పెట్టి.. చంద్రబాబు.. ఎక్కడివారికో ఇక్కడ పగ్గాలు ఇస్తే.. ప్రయోజనం ఉంటుందా? అనేది పనబాక వర్గంలో మెదులుతున్న ప్రధాన సందేహం. మరి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.