పంచాయతీ ఎన్నికల్లో పైచేయి ఎవరిది?

తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలిద‌శ పోలింగ్ ముగిసింది. గురువారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల పోలింగ్‌కు ఓట‌ర్లు క్యూక‌ట్టారు. ప‌ల్లేక‌దా.. అని ఓట‌ర్లు లైట్ తీసుకోలేదు. ఎక్క‌డెక్క‌డి నుంచో వచ్చి.. త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా వ‌చ్చిన వారు ఉన్నారు. మొత్తంగా పంచ‌య‌తీల్లో తొలి ద‌శ పోరు స‌క్ర‌మంగా.. స‌జావుగా సాగిపోయింది.

ఇదిలావుంటే.. పోలింగ్ ముగిసిన వెంట‌నే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు అధికారులు లెక్కింపు చేప‌ట్టారు. తొలి అర గంట‌లోనే దాదాపు ఫ‌లితం వ‌చ్చేసింది. దీనిలో కాంగ్రెస్ హ‌వా స్ప‌ష్టంగా క‌నిపించింది. మెజారిటీ ప‌ల్లెల‌ను కాంగ్రెస్‌పార్టీ సానుభూతిప‌రులు, ఆ పార్టీకి మ‌ద్ద‌తుగా ఉన్న నాయ‌కులు ద‌క్కించుకున్నారు. ఇక‌, బీఆర్ ఎస్ దాదాపు చాలా వెనుక‌బ‌డింద‌నే చెప్పాలి.

కాంగ్రెస్ వంద‌ల సంఖ్య‌లో ప‌ల్లెల‌ను ద‌క్కించుకుంటే.. బీఆర్ ఎస్ పార్టీ కేవ‌లం ప‌దుల సంఖ్య‌లోనే ప‌ల్లెల్లో త‌న అస్థిత్వాన్ని నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నాలు చేసింది. ఇక‌, ఇత‌ర పార్టీలు కూడా.. త‌మ స‌త్తా చాటుకున్నాయ‌నే చెప్పాలి. వెర‌సి మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి భావించిన‌ట్టుగా ప‌ల్లెల్లోనూ ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకే ద‌న్నుగా నిలిచార‌ని చెప్పాలి.

కార‌ణాలు ఇవేనా?

కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు దారుల‌ను భారీ సంఖ్య‌లో గెలిపించ‌డం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి, ఆయ‌న ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లకు విశ్వాసం ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్ర‌భుత్వం ఫ్యూచ‌ర్ సిటీ నుంచి పెట్టుబ‌డుల వ‌ర‌కు, పేద‌ల నుంచి రైతుల వ‌ర‌కు తీసుకుంటున్న కార్య‌క్ర‌మాలు, ప్ర‌క‌ట‌న‌లు వంటివి ప్ర‌భావం చూపుతున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక‌, బీఆర్ఎస్ విష‌యానికి వ‌స్తే.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, క‌విత చేస్తున్న‌యుద్ధం వంటివిప్ర‌జ‌ల‌పై పెద్ద ఎత్తున ప్ర‌భావం చూపుతున్నాయ‌న్న చ‌ర్చ కూడా తెర‌మీద‌కి వ‌చ్చింది.