పంచాతీయ స్వ‌`రూపం`పై జ‌న‌సేన ఎఫెక్ట్ ..!

గ్రామ పంచాయ‌తీల‌పై జ‌న‌సేన పార్టీ ప‌ట్టు బిగించే దిశ‌గా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక స‌దుపాయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్న ఈ పార్టీ.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. తాజాగా కేంద్రం నుంచి మ‌రో 2 వేల కోట్ల రూపాయ‌లు పంచాయ‌తీల‌కు అందాయి. ఈ నిధుల‌ను మ‌రింత స‌క్ర‌మంగా వినియోగించి.. పంచాయ‌తీల్లో మౌలిక స‌దుపాయాల‌ను పెంచాల‌ని డిప్యూటీ సీఎంగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యించారు.

ఇదేస‌మ‌యంలో ఆయ‌న పార్టీ నాయ‌కుల‌ను కూడా దిశానిర్దేశం చేశారు. ప‌నులు అధికారులు చేస్తారు.. మీరు ప్ర‌చారం చేయండి!. అని సూచించారు. దీనికి సంబంధించి పెద్ద రోడ్ మ్యాప్‌ను కూడా ప‌వ‌న్ నిర్దేశించారు. దీనిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాల‌ని కూడా సూచించారు. త‌ద్వారా.. పంచాయ‌తీల్లో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించే కార్య‌క్ర‌మాన్ని కేవ‌లం ప‌నుల‌కు స‌రిపుచ్చ‌కుండా.. ప్ర‌చారం ద్వారా ప్ర‌జ‌ల‌కు చేర‌వేయాల‌ని నిర్ణ‌యించారు.

వైసీపీకి ప్ర‌స్తుతం పంచాయ‌తీల్లో అంతో ఇంతో బ‌లం ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓటు బ్యాంకును ప‌రిశీలిస్తే.. పంచాయ‌తీల్లో వైసీపీ ఓటు బ్యాంకు గ‌ణ‌నీయంగా పెంచుకుంది. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల కంటే కూడా.. పంచాయ‌తీల్లో వైసీపీ దూసుకుపోయింది. దీనిని గ‌మ‌నించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీని భారీగా దెబ్బ కొట్టాలంటే.. పంచాయ‌తీల్లో దూసుకుపోవ‌డం కీల‌కమ‌ని భావిస్తున్నారు. అందుకే.. త‌ర‌చుగా పంచాయ‌తీలు, గ్రామాభ్యుద‌యం పేరుతో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

దీని నుంచి వ‌చ్చిందే.. `ప‌ల్లె పండుగ‌` కార్య‌క్ర‌మం. దీని ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌న్న‌ది ఆయ‌న ఉద్దేశం. ఇప్ప‌టికే దీనిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డంతోపాటు.. ర‌హ‌దారులు, తాగునీరు, విద్యుత్‌, ఇంటింటికీ కుళాయిలు.. వంటి అనేక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నారు. త‌ద్వారా పంచాయ‌తీల మౌలిక స్వ‌రూపం మార్చి.. దానిని త‌మ‌కు అనుకూల ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇది వైసీపీకి మైన‌స్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.