తెలంగాణ నాయకులు పదే పదే గోదారి పచ్చదనం గురించి మాట్లాడడం, దిష్టి తగలడం వల్లే పచ్చటి కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోయి తలలు లేని మొండాలుగా మిగిలాయి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. పవన్ వి మైండ్ లెస్ వ్యాఖ్యలంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇప్పటికే ఆ వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా పవన్ కళ్యాణ్ పై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే.
పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వబోమని వార్నింగ్ ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలు తనను బాధించాయని, పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల దిష్టి తగలడం కాదని, ఆంధ్రా పాలకుల వల్లే తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం తాగారని అన్నారు.
పవన్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమా ఒక్కటి కూడా ఆడదని, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రిగా చెబుతున్నానని హెచ్చరించారు. ఒక్క థియేటర్‌లో కూడా సినిమా విడుదల కాదని పవన్ కు వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి సూపర్ స్టార్ అని, ఆయన మంచోడని ప్రశంసించారు. రాజకీయ అనుభవం లేకే పవన్ ఇలా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates