విశాఖపట్నానికి పెట్టుబడులు, ఐటీ సంస్థల రాకతో ఇప్పటికే భారీ మైలేజీ వచ్చింది. గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఈ నగరం ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఎక్కడ విన్నా.. విశాఖ పేరు వినిపిస్తోంది. ఏ నలుగురు కలుసుకున్నా.. విశాఖ అభివృద్ధి, పెట్టుబడులు, ఐటీ రాజధాని, ఆర్థిక రాజధానిగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఈ నగరం అభివృద్ది శర వేగంగా ముందుకు సాగుతోంది. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెండుగా లభించనున్నాయి.
ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి కూడా విశాఖను కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే రుషి కొండపై వైసీపీ హయాంలో నిర్మించిన భారీ భవంతిని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మంతనాలు చేస్తున్నారు. దీనిపై ప్రత్యేకంగా సూచనలు చేసేందుకు, సలహాలు ఇచ్చేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇక, ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు సుమారు 50 కిలో మీటర్ల దూరాన్ని పర్యాటక తీర ప్రాంత కారిడార్‌గా మారుస్తున్నారు. ఇప్పటికే బస్సు టూరిజం పేరుతో అన్ని మౌలిక సదుపాయాలతో రెండు బస్సులను గత నెలలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
ఈ పరంపరలో తాజాగా మిర్రర్ టూరిజం పేరుతో మరో సరికొత్త సొబగు.. విశాఖశిగలో చేరింది. విశాఖలోని ప్రఖ్యాత కైలాసగిరిపై ఏర్పాటు చేసిన ఈ మిర్రర్ టూరిజంలో `స్కైవాక్` పేరుతో చేసిన ఏర్పాట్లు ప్రపంచ స్థాయి పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయని రాష్ట్ర పర్యాటక శాఖ చెబుతోంది. తాజాగా ఈ ప్రాజెక్టును విశాఖ ఎంపీ భరత్ ప్రారంభించారు. ఇది దేశంలోనే అత్యంత పొడవైన `గ్లాస్ స్కై వాక్`గా పర్యాటక శాఖ పేర్కొంది. దీనికి ముందు చైనాలో నిర్మించిన అతి పెద్ద గ్లాస్ స్కైవాక్ తర్వాత.. విశాఖ రెండో స్థానంలో ఉందని వివరించింది. దీనిని పీపీపీ విధానంలో అభివృద్ది చేశారు.
స్కైవాక్ బ్రిడ్జ్ డైమన్షన్లు ఇవీ..
కైలాస గిరిపై నిర్మించిన మిర్రర్ స్కైవాక్ బ్రిడ్జిని వైసీపీ హయాంలోనే ప్రారంభించారు. అయితే.. మధ్యలోనే ఆగిపోయింది. కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. దీనిని కొనసాగించింది. దీనికి గాను సుమారు 7 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఇది.. 500 టన్నుల బరువును మోయగలదు. ఒకేసారి 40 మంది పర్యాటకులను అనుమతిస్తారు. వారు ఈ బ్రిడ్జిపై ఎగిరినా.. పరుగులు పెట్టినా తట్టుకునే సామర్థ్యంతో దీనిని నిర్మించడం విశేషం. ఈ బ్రిడ్జి మొత్తం పొడవు.. 55 మీటర్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇది విశాఖ సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తుతో ఉంటుందని.. పర్యాటకులకు కొత్త అనుభూతిని మిగుల్చుతుందని వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates